1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

17 నుంచి "శిల్పాశెట్టి" బిగ్ బాస్-2 ప్రసారం

వినోదం వెండితెర కథనాలు అంతర్జాతీయం బిగ్ బ్రదర్స్ బిగ్ బాస్-2 కార్యక్రమం
అంతర్జాతీయంగా "బిగ్ బ్రదర్స్" షో విజేతగా నిలిచి పేరు సంపాదించుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి... ఈ నెల 17వ తేదీ నుంచి బిగ్ బాస్-2 కార్యక్రమం ద్వారా అభిమానులను అలరించనుంది. శిల్పాశెట్టి వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.. కలర్స్ ఛానెల్‌లో ప్రతిరోజూ రాత్రి పది గంటలకు ప్రసారమవుతుంది.

ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ... వ్యాఖ్యాతగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొనే వారు ఎలాంటి భావోద్వేగాలను అనుభవిస్తారో తనకు బాగా తెలుసునని చెప్పారు. కొత్తవారి మధ్య అన్ని రోజులు గడపటం ఎవరికైనా కష్టమేనని, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం మానసికంగా రాటు దేలుస్తుందని ఆమె చెప్పారు.

ఇక ఈ కార్యక్రమ వివరాలకెళితే... ప్రొగ్రామ్‌లో పాల్గొనే వారంతా 12వారాల పాటు గృహ నిర్భంధంలో గడపాల్సి ఉంటుంది. మొత్తం 14మంది పోటీ దారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో అంతిమ విజేత రూ.75లక్షలు గెలుచుకుంటారు.

ఎడిట్ చేయని భాగం అర్ధగంటసేపు ప్రసారమవుతుంది. 32 కెమెరాల సహాయంతో వీరి ప్రతి కదలికను చిత్రీకరిస్తారు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు కెమేరాల నీడలో గడపాల్సి ఉంటుంది. ఇందుకోసం ముంబై శివార్లలో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణలో శిల్పకు మరో 250 మంది నిపుణులు సహకరిస్తారని ప్రోగ్రామ్ నిర్వాహకులు వెల్లడించారు.
About Writer
Selvi