1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఇలా అవుతుందనుకోలేదు : జగపతి బాబు

వినోదం వెండితెర కథనాలు కాశ్మీర్‌ అల్లర్లు జగపతిబాబు మీరాజాస్మిన్ జంట దాసరి నారాయణరావు బంగారుబాబు షూటింగ్
WD
కాశ్మీర్‌లో ఒక్కసారైనా షూటింగ్ చేయాలనే తన 30 ఏళ్ళ కల నెరవేరినందుకు ఓ వైపు ఆనందంగా ఉన్నా, ఇటువంటి స్థితిలో తిరిగి రావడం బాధ కల్గించిందని నటుడు జగపతి బాబు అన్నారు. కాశ్మీర్ అల్లర్లు జరుగుతున్న తరుణంలో జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా దాసరి నారాయణరావు నిర్మిస్తోన్న "బంగారుబాబు" షూటింగ్ జరుగుతోంది.

అక్కడ అల్లరిమూకలు చేసిన గొడవకు షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత వారంతా చిత్ర యూనిట్‌ బస చేసిన హోటల్‌ను నిర్భంధించారు. బయటకు రావడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఆర్మీ రక్షించకపోతే సురక్షితంగా బయటపడేవారం కాదని జగపతిబాబు స్పష్టం చేశారు.

బుధవారం రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ కలుగజేసుకోవడం వల్ల అక్కడ ఆర్మీ, పోలీసులు సహకరించారని పేర్కొన్నారు. అక్కడ మీడియేటర్ పలమ్‌రాజు మమ్మల్ని కాపాడారన్నారు.

అక్కడ షూటింగ్ అంతరాయం జరిగినా అదొక కలగా ఇంకా మిగిలిపోయిందన్నారు. ఇప్పటికీ అక్కడ చాలా ప్రమాదకర పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. జగపతి రాకను పురస్కరించుకుని ఆయనకు అభిమానులు పూలవానతో స్వాగతం పలికారు. వారిని చూసి కాసేపు జగపతిబాబు ఉద్వేగానికి గురయ్యారు.

ఎయిర్‌పోర్టులో బాంబు టెన్షన్:
ఇదిలా ఉండగా, జగపతి రాకకోసం ఇంకా సమయం ఉందనగా చిన్న సంఘటన చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి వదిలివెళ్ళిన పాలిథిన్ కవర్ అక్కడ గందరగోళాన్ని సృష్టించింది.

చాలాసేపటికి దానికోసం ఎవరూ రాకపోయేసరికి బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి చెకప్ చేసింది. దీంతో అక్కడ మీడియాతో పాటు ప్రజలు కూడా భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. కాసేపటకి ఓ వ్యక్తి వచ్చి అది తన బ్యాగేనని తీసుకెళ్ళాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భయాందోళనకు కారణమయిన ఆ వ్యక్తిని అంతా తూలనాడారు.
About Writer
Selvi