1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కొత్త బంగారులోకం" ఆడియో ఆవిష్కరణ

వినోదం వెండితెర కథనాలు కొత్త బంగారులోకం ఆడియో ఆవిష్కరణ
WD
కొత్త కథలతో, సరికొత్త కథనాలతో యువ దర్శకులొస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఆలోచించి చక్కని కథను అందించారు. భిన్న కథలతో మట్టిలో మాణిక్యాలొస్తున్నాయి.

ఇతర భాషలకు నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ఎగుమతి చేసిన ఘనత తెలుగు చిత్ర సీమదే. నేడది మారిపోయి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చినా, మళ్ళీ ఎగుమతి చేసే పూర్వవైభవం కలుగుతోందనిపిస్తుంది. మన తెలుగు సినిమా "కొత్తబంగారులోకం"లో అడుగుపెట్టబోతుంది. అని ప్రముఖ గీత రచయిత "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి అభిప్రాయపడ్డారు.

"హ్యాపీడేస్" ఫేం వరుణ్ సందేశ, శ్వేత జంటగా శ్రీకాంత్ అడ్డాలను దర్శకునిగా పరిచయం చేస్తూ... శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై "దిల్" రాజు నిర్మిస్తున్న చిత్రం "కొత్త బంగారులోకం" ఆడియో ఆవిష్కరణ ఆదివారం నాడు జరిగింది. అల్లు అర్జున్, ప్రభాస్ సీడీ, క్యాసెట్‌లను ఆవిష్కరించగా, ఎన్.టి.ఆర్, బొమ్మరిల్లు భాస్కర్ అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ... రాజన్న (దిల్ రాజు) తనకు సీడీని పంపించారని, సిరివెన్నెలగారు రాసిన "నేనని... నీవని..." పాట విపరీతంగా నచ్చిందని చెప్పారు. ఈ పాటను వందసార్లు విన్నానని, తన కెరీర్‌లో ఇలాంటి పాటలో నటించలేనని, ఎందుకంటే ఇమేజ్ చట్రంలో బందీ అయిపోయామన్నారు.

WD
నూతన నటీనటులతో వచ్చిన "హ్యాపీడేస్"తో షాక్ తిన్నామని, "కొత్త బంగారులోకం" మరోసారి షాక్ అయ్యే అవకాశం ఉందని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే హ్యాపీగా సెటిసైపోయామనుకునే మా లాంటి వారు, ఇంకా కష్టపడాలని కొత్త వాళ్ళు గుర్తు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారు వస్తేనే పరిశ్రమ పచ్చగా ఉంటుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే తన ప్రసంగంలో అల్లు అర్జున్‌ను "బావా" సంబోధించడం విశేషం.

దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ పూర్తయిందని, మిక్కీ జె. మేయర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడని అన్నారు. పాటలన్నీ అదరగొట్టాయని, సినిమా సూపర్ హిట్ అవుతుందని అల్లు అర్జున్, ప్రభాస్ ఆకాంక్షించారు.

బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ... పరుగు షూటింగ్ సమయం నుంచి ఈ పాటలు వింటున్నానని, సహజంగా తాను బాత్ రూం సింగర్‌నేనని, ఈ మధ్య కాలంలో బాత్‌రూంలో ఎక్కువగా పాడుకున్న పాటలు ఈ చిత్రంలోనివేనని చెప్పారు.

హీరో వరుణ్ స్పందిస్తూ... ఇందులో తనను హీరోగా సెలక్ట్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, కెమెరామేన్ చోటా. కె. నాయుడు గారు తనను అందంగా చూపించారని వెల్లడించారు. పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయని చెప్పారు.

దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఫ్రెష్ లుక్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకోకుండా, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులను నటింపజేశామని, ఇందులకు సహకరించిన వారి తల్లిదండ్రులకు, షూటింగ్ జరుపుకోడానికి అనుమతిచ్చిన కాలేజీల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నం పెట్టిన చేతులను ఎప్పుడూ మర్చిపోకూడదని, ఈ క్రమంలో "దిల్" రాజుకు రుణపడి ఉంటానని అన్నారు.
About Writer
Selvi