1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"హీరో"గా తెరకెక్కనున్న నితిన్!

వినోదం వెండితెర కథనాలు తెర హీరో పేరు మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం నితిన్
WD
తెరపై హీరోగా కన్పించే నితిన్ అదే తెరపై దాని అర్థమేమిటో చెప్పబోతున్నాడు. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మన్యం రమేష్ నిర్మిస్తోన్న చిత్రానికి "హీరో" అనే పేరును ఖరారు చేశారు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన జీవి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. "హీరో" టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని హంపి రెస్టారెంట్‌‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు టైటిల్‌లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మన్యం రమేష్ మాట్లాడుతూ... "బావగారు బాగున్నారా" నుంచి నాగబాబు గారి సినిమాలకు పనిచేశానని, వారి సహాయంతో "ముని" చిత్రాన్ని రూపొందించామని అన్నారు. తొలిసారిగా హీరోతో "హీరో" చేశానని, నటుడు అయిన జి.వి. సుధాకర్ నాయుడు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడించారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చిందని, హీరోతో పాటు హీరోయిన్‌కూ ప్రాధాన్యత గల కథ ఇదని, "ఒంటరి" తర్వాత భావన ఈ చిత్రంలో నటించదన్నారు. నాగబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ... "సై" చిత్రం అంత స్టైలిష్‌గా ఉన్న కథ ఇదని, పాత్రపరంగా తన హెయిర్ స్టైల్, చేతికిగాటు స్పోర్ట్స్ బైక్ ఉంటాయని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ తరహాలో ఈ చిత్రముంటుందని, రెండు పాటలు, క్లైమాక్స్ మినహా పూర్తయిందని, ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలను చిత్రిస్తారని చెప్పారు. అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దర్శకుడు జీవీ మాట్లాడుతూ... పలు భాషల్లో 150 చిత్రాల్లో నటించానని, అయినా ఏదో తెలీని వెలితి కన్పించేదని, తనకొచ్చిన ఆలోచనలతో ఓ కథను రెడీ చేసుకున్నానని, దానికి తగ్గ హీరోగా నితిన్‌ను ఎంపిక చేసినట్లు అన్నారు. తన టాలెంట్ గుర్తించి రమేష్ గారు దర్శకునిగా అవకాశం కల్పించారని వెల్లడించారు. సోమవారం వంద బైక్‌లతో 4 కెమేరాలు పెట్టి చిత్రించామని, అద్భుతంగా వచ్చిందని, ఇందులో నితిన్ కొత్తగా కన్పిస్తాడని అన్నారు. అమాయకత్వం ఉట్టిపడే పాత్రలో భావన నటించిందని తెలిపారు.

నాగాబాబు మాట్లాడుతూ... విజువల్ సెన్స్ ఉన్న దర్శకుడు జీవీ అని, నటుడిగా తనకు బాగా తెలుసునని, ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మాస్ ఎంటర్‌టైనర్ దర్శకుడిగా ఎదుగుతాడనే నమ్మకముందన్నారు. రొటీన్‌గా నితిన్ తండ్రి పాత్రను పోషించానని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో కోవైసరళ, బ్రహ్మానందం, తనూరాయ్, ప్రియాంక కుమార్, కోట, బాబూ మోహన్, అలీ, రాజేష్, సూర్య, నర్సింగ్ యాదవ్, జోగినాయుడు తదితరులు నటించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సుధాకర్ నాయుడు (జీవీ), సంగీతం... మన్యం రమేష్, కెమెరా... రాంప్రసాద్, ఎడిటర్.. మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్... ఆనంద్ సాయి, పాటలు.. అనంత్ శ్రీరామ్, భాస్కర పట్ల, మాటలు.. నివాస్, ప్రొడక్షన్ కంట్రోలర్... మోహన్, ఎగ్జిక్యూటివ్.. ప్రసాద్ చౌదరి.
About Writer
Selvi