"చెన్నై-600028" చిత్ర దర్శకుడు తాజాగా తెలుగు, తమిళ భాషల్లో దర్శకత్వం వహించిన చిత్రం "సరోజ". ఈ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగులో కూడా ఆదరణ పొందుతున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం నాడు ఫిలింఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలుగులో తొలిసారిగా తనను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు.
న్యూటాలెంట్ ఎక్కడుందో అక్కడ తెలుగువారు ఆదరిస్తారని తనకు బాగా తెలుసునని, తనకు తెలుగు రాకపోయినా... ఎస్.పి.చరణ్, వైభవ్ ఎంతో సహకరించారని అన్నారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి పాత్రలు చిత్రానికి కీలకంగా అమరాయని, ఎక్కువగా రాత్రిపూట సాదే కథను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
వైభవ్ మాట్లాడుతూ... రిలీజ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని, టెక్నికల్‌గా బాగా తీశారని అందరూ అంటున్నారని, ఈ విజయమంతా డైరక్టర్‌కే చెల్లుతుందని చెప్పారు.
ఎస్.పి.చరణ్ మాట్లాడుతూ.. తాను తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం "నాలో". కానీ ఇదే తన స్ట్రెయిట్ మూవీగా భావిస్తున్నానని, మద్రాసులో పుట్టిపెరగడం వల్ల తెలుగు మాట్లాడేటప్పుడు కాస్త భయపడ్డానని, కానీ సినిమా చూశాక అంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉందనిపించిందని అన్నారు. ఈ సక్సెస్ తనకే ఆశ్చర్యమేసిందని అన్నారు.
ఇంతకుముందు తాను నిర్మించిన "చెన్నై-600028"ను "కొడితే కొట్టాలిరా"గా తెలుగులో డబ్ చేశామని, కానీ ఆదరణ చూరగొనలేదని అన్నారు. దాంతో "సరోజ" విడుదలకు ముందు టెన్షన్‌కు గురయ్యాను. కానీ రిలీజ్ తర్వాత అందరూ మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు.