నాజర్, సీత, భానుప్రియ, చంద్రమోహన్, రామిరెడ్డి తదితరులు నటించిన "మహాయజ్ఞం" చిత్రం క్లీన్ "యు" సర్టిఫికేట్ పొందింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత రవీందర్ గుప్త తెలియజేశారు. ఈ చిత్రాన్ని 20 ప్రింట్లతో 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రంలో సీనియర్ నటీనటుల మధ్య కృష్ణమారుతి అనే నూతన నటుడు చక్కగా నటించారని పేర్కొన్నారు. వందేమాతరం శ్రీనివాస్ బాణీలు ఆకట్టుకున్నాయని, చక్కని సందేశాత్మకంగా ఈ సినిమాను మలిచామని చెప్పారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... వాస్తవ సంఘటనను కథగా ఎంచుకుని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన చూరగొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు తాను 9 చిత్రాలకు దర్శకత్వం వహించినా కష్టపడి, ఇష్టపడి ఈ చిత్రాన్ని చేశానని, ఇదే తనకు తొలి చిత్రమని అన్నారు. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను కల్గిస్తాయన్నారు. ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసే కథాంశమిదని తెలిపారు.
ఈ చిత్రంలో తాను నటించినందుకు ఆనందంగా ఉందని కృష్ణమారుతి తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు... దానం వెంకట్రావ్, కెమెరా.. సురేందర్ రెడ్డి, ఎస్.డి.జాన్, సంగీతం... వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్.. వెంకటేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... కృష్ణతోట.