ఘనంగా "సోల్జర్" ఆడియో ఆవిష్కరణ
|
ఇందులో ఐదు పాటలున్నాయి. కృష్ణగారు నటించి "అల్లూరి సీతారామరాజు"లోని " "తెలుగువీరలేవరా..." తరహాలో "భారతీయుడా... ఓ భారతీయుడా..." అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత బాలాజీ చెప్పారు. ప్రసన్నకుమార్ సమకూర్చిన బాణీలు అందర్నీ ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. గురువారం నాడు ఫిలింఛాంబర్‌లో "సోల్జర్" పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి ఆడియోను కృష్ణ విడుదల చేసి విజయనిర్మలకు అందించారు.
కృష్ణ మాట్లాడుతూ... సరిహద్దుల్లో వుంటూ దేశాన్ని కాపాడేవాడు సోల్జర్ అయితే, దేశ కీర్తి ప్రతిష్టతలను పెంచడానికి క్రీడాకారుడు ఉపయోగపడతాడని, ఇదే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఈ సినిమా బాణీలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
దర్శకురాలు విజయ నిర్మల మాట్లాడుతూ... సెంటిమెంట్, కామెడీతో పాటు అన్ని మసాలాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి. కళ్యాణ్ మాట్లాడుతూ... నిర్మాత బాగుండాలని ఆశించే వ్యక్తి కృష్ణ అని, విజయనిర్మల గొప్ప దర్శకురాలని ప్రశంసలతో ముంచెత్తారు. ఎటువంటి సన్నివేశాన్నైనా విజయనిర్మల సింగిల్‌టేక్‌లో చేయగల సమర్థురాలని అన్నారు. ఆమె దర్శకత్వంలో అసిస్టెంట్‌గా పని చేయాలని అనుకున్నానని, కానీ సాధ్యపడలేదని వెల్లడించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలాకాలం తర్వాత తనకు నచ్చిన సినిమాకు సంగీతాన్ని సమకూర్చానని, దేశభక్తి గీతాన్ని జయసూర్య రాస్తే దానికనుగుణంగా స్వరాలు సమకూర్చానని ప్రసన్నకుమార్ తెలిపారు.
ఇంకా సమీర్, చిత్రం బాషా, ప్రియాంక, కొండవలస, రాగిణి, గీతాసింగ్, గుండుహనుమంతరావు, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా... ఆళ్ళ రాంబాబు, పాటలు.. బొంపెం జయసూర్య, రాణిపులోమాదేవి, ఎడిటర్... నాగిరెడ్డి, మాటలు... ప్రణీత్ వర్మ, ప్రేమ్‌రాజ్, కథ, స్క్రీన్‌ప్లే, బాలాజీ, నిర్మాత... కృష్ణవేణి, దర్శకత్వం.. విజయనిర్మల.