బాహ్యప్రపంచం భావిస్తున్నట్టుగా సినిమా రంగం లేదని సీనియర్ నటుడు అలీ చెబుతున్నారు. తెలుగు సినీ రంగంలో అవకాశాలు వెల్లువల్లా వస్తుండటంతో ముంబై నుంచి చాలామంది హీరోయిన్లు ఇక్కడికి చేరుకుంటున్నారని వెల్లడించారు. పూర్వం సినిమా వాళ్లంటే హీరోయిన్లపై రకరకాలుగా ప్రవర్తించే వారని టాక్ ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా మారిందని అలీ అంటున్నారు.
ఈ మధ్య ముంబై నుంచి వస్తున్న చాలామంది హీరోయిన్లు ఆంధ్రాకు వస్తున్నారని, వారంతా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని చెప్పారు. దీన్ని తీర్చడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయినా నిర్మాతలను ఏమీ అనలేమని, హీరోయిన్లకు డేట్స్ చూస్తున్న మేనేజర్లను అనాలని, వాళ్ళే హీరోయిన్లను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇంకా అలీ మాటల్లో వినాలంటే... గతంలో అయితే ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లు నేరుగా వాళ్ళింటికో, తెలిసిన వారి ఇంటికో వెళ్ళేవారు. అప్పట్లో క్రమశిక్షణగా మెలిగే వారు. ఇప్పుడన్నీ భ్రష్టుపట్టాయి. ఇంకా చెప్పాలంటే.. ముంబై నుంచి పెట్టి సర్దుకుని ఇక్కడి వస్తున్న హీరోయిన్లతో పాటు మేకప్‌మెన్, వారికి కావాల్సిన వారికి విమాన టిక్కెట్లు బుక్ చేయాల్సిన పరిస్థితి.
తీరా దిగగానే కారు కావాలి. అక్కడ నుంచి నేరుగా తాజ్ కృష్ణ, తాజ్ బంజారా వంటి స్టార్ హోటల్స్ బుక్ చేయాలి. ముంబైలో ఉంటే వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. కానీ ఇక్కడకు వస్తే రాచమర్యాదలు కోరుకుంటారు. సూట్ రూమ్, షూటింగ్‌లో సపరేట్ రూమ్‌ను కోరుకుంటారు" అని హీరోయిన్ల వాలకంపై అలీ వాపోయారు.
మరోవైపు... చాలామంది పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతోనే నటిస్తామని చెబుతున్నారు. తను చైల్డిస్ట్ ఆర్టిస్టునని, అలాగే కృష్ణభగవాన్ సరసన సిమ్రాన్, రమ్యకృష్ణ వంటి అగ్రహీరోయిన్లు నటిస్తుంటే... ఇప్పటి హీరోయిన్లు మా బోటి వారితో నటించడమంటే నమోషీగా ఫీలవుతున్నారని చెప్పారు. చాలా బిల్డప్‌లు ఇస్తున్నారని, ప్రధానంగా హీరోయిన్లను మేనేజర్లే చెడగొడుతున్నారని అందుకే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
అదేమిటంటే... ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యులుగా నమోదు కావాలని "మా" జాయింట్ సెక్రటరీ చెబుతున్నారని అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. సినిమా వాతావరణం చాలా హెల్దీగా ఉందని, ఆడపిల్లలు సినిమాల్లో నటించవచ్చునని, ఆసక్తి గలవారు "మా" కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని అలీ ప్రకటించారు.