శివాజీ, అలీ, కృష్ణభగవాన్ హీరోలుగా నటిస్తున్న చిత్రం "కుబేరులు" (వీళ్లకి అన్నీ అప్పులే). శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ నెల 29 నుంచి రీరికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని దర్శకుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ మొదటివారంలో ఆడియోను, రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో బ్రహ్మం మాటలు కడుపుబ్బ నవ్విస్తాయన్నారు. అలీ, కృష్ణ భగవాన్‌లు చక్కగా సహకరించారని, ఇందులో ఐదు పాటలున్నాయని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ నెలాఖరులో ఓ పాటను చిత్రీకరించనున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ... కుటుంబకథా చిత్రాల్ని తీసే ఎస్.వి. కృష్ణారెడ్డి కోవలోనే శ్రీనివాసరెడ్డి సాగుతూ చక్కని హాస్య చిత్రాల్ని రూపొందిస్తున్నారని చెప్పారు. వీళ్లకి అన్నీ అప్పులే అనే ట్యాగ్‌లైన్ ఫన్నీగా ఉందన్నారు. శివాజీ, తాను బావమరిదిగా నటించామని, బావగారైన శివాజీకి ఊరి ప్రెసిడెంట్ కావాలన్న కోరిక ఉండేదని, కానీ ఆ ప్రయత్నంలో ఓడిపోతాడని, ఈ తరహాలో హాస్యం ఏవిధంగా పండిస్తామన్నదీ సినిమాలోనే చూడాలని వెల్లడించారు.
ఇకపోతే కృష్ణ భగవాన్ దుబాయ్ నుంచి సంపాదించుకుని ఇండియా వస్తాడని, ఇక్కడకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? ముగ్గురు కుబేరులం... ఎలా అయ్యామనేదే సినిమా అని అలీ చెప్పారు.
కాలనీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో తాను హోటల్ ఓనర్‌గా నటించానని ఎవీఎస్ అన్నారు. కోడైరక్టర్‌గా ఉన్న తనను డైలాగ్‌రైటర్‌గా ప్రమోషన్ ఇచ్చిన శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని బ్రహ్మం అన్నారు. ఈ చిత్రాన్ని ఆరుగురు స్నేహితులు కలిసి తీశామని, జీవన్ థామస్ చక్కని సంగీతం సమకూర్చారని నిర్మాత సురేష్ చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో ఫర్జానా, కౌష, ఎం.ఎస్. రఘుబాబు, కొండవలస, దువ్వాసి మోహన్, తెలంగాణ శకుంతల, రజిత, భువనేశ్వరి తదితరులు నటించారు. కథ...శివ, సురేష్, మాటలు... దాసరి బ్రహ్మం, పాటలు.. భాస్కర పట్ల, కెమెరా... రామ్‌పిని శెట్టి.