1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పొన్నాల చేతుల మీదుగా "మహా నగరంలో" ఆడియో

వినోదం వెండితెర కథనాలు పొన్నాల లక్ష్మయ్య మహా నగరంలో ఆడియో శ్రీవాసవి విజువల్స్ పతాకం యశ్వంత్
WD
రాష్ట్ర భారీ నీటీ పారుదల శాఖామాత్యులు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా "మహానగరంలో" ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. శ్రీవాసవి విజువల్స్ పతాకంపై యశ్వంత్, విజయభాస్కర్ హీరోలుగా, పూనమ్ సింగార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఓం నమశ్శివాయ ఎర్రం నిర్మించారు. శ్రీనివాస్ జి. ఎల్.బి. దర్శకత్వం వహించారు. సోమవారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూథియోటర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆడియో సీడీని ఆవిష్కరించగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వజ ఆడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.... కొత్తతరం సినీ రంగంలో ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నేడు ఇండస్ట్రీలో హీరోల కొరత ఉందని తెలిపారు. ప్రస్తుతం 14, 15 మంది హీరోయిన్లు ఉన్నా ఏడాదికి 20 సినిమాలు కూడా తెరపైకి రావడం లేదని చెప్పారు.

మొత్తం 30 మంది హీరోలుంటే పరిశ్రమ కళకళలాడుతుందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చిన్న సినిమాల ఆడియోను మార్కెట్ చేస్తోన్న ఆదిత్య మ్యూజిక్‌ను ఈ సందర్భంగా అభినందించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. మరోవైపు పైరసీ ఆడియోను కూడా తినేస్తుందన్నారు. దీనికి అందరూ కృషి చేయాలని సూచించారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... కొత్తదనంతో కూడిన సంగీతాన్ని ఈ సినిమాకు అందించానని చెప్పారు. నేడు ఇంటర్‌నెట్ వల్ల ఆడియో డౌన్‌లోడ్స్, ఎం.పీ.3ల వల్ల పైరసీ ఎక్కువైందని తెలిపారు. ఎంతో కష్టపడి చేసిన సంగీతం ఇలా కావడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒరిజినల్ ఆడియోనే కొనాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ... ఒకవైపు పోలీసులు, మరోవైపు లా అండ్ ఆర్డర్ ఉన్నా పైరసీ నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టాలని చెప్పారు. పైరసీదారులను కఠినంగా శిక్షించి పరిశ్రమను బతికించాలని మంత్రిని ఈ సందర్భంగా కోరారు. నేడు రెగ్యులర్ నిర్మాతలు ఎవ్వరూ చిత్రాలు తీయడం లేదని, కొత్త వారి రాకతోనే ఇండస్ట్రీ కళకళ లాడుతుందని చెప్పారు.

మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... చిత్రంలోని అన్ని పాటలు విన్నానని, చాలా బాగున్నాయని చెప్పారు. సినిమాకు, తనకు అవినాభావసంబంధం ఉందని ఆయన చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ తన క్లాస్‌మేట్‌టని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హాజరు కావడం ద్వారా పాత విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నానన్నారు. అప్పట్లో వరంగల్‌లో ఉన్నప్పుడు "రోజులు మారాయి" చిత్రాన్ని వంద రోజుల తర్వాత చూశానన్నారు.

తాను చూసిన తొలి సినిమా అదేనని, అప్పుడు టిక్కెట్ ధర 6 అణాలు. నేడు రోజులు మారాయి. చిత్రాల తీరు మారింది. మన రాష్ట్రంలోనే అత్యధిక సినిమాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. వినోదంతో పాటు సందేశాన్ని కూడా చిత్రంలో చొప్పించాలన్నారు.

ఇక....పైరసీ విషయానికొస్తే.... దీనిపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పొన్నాల హామీ ఇచ్చారు. పైరసీ దారులను నియంత్రించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకునే దిశగా కృషి చేస్తామని పొన్నాల తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు అశోక్ కుమార్, తారకరత్న, ఆదిత్య దయానంద్, హీరోలు యశ్వంత్, విజయభాస్కర్, సమీర్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యతగా భార్గవి వ్యవహరించారు.
About Writer
SELVI.M