1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నిర్మాత బాధ్యత అంతటితో తీరిపోదు: రామారావు

వినోదం వెండితెర కథనాలు సినిమా రిలీజ్ నిర్మాత బాధ్యత అంతటి తీరిపోదు పైరసీ సెల్ నిర్మాత సహకరించాలి  కెఎస్ రామారావు
WD
సినిమా రిలీజ్ చేయడంతోనే నిర్మాత బాధ్యత తీరిపోదనీ, పైరసీని నియంత్రించడంలో పైరసీ సెల్‌కు నిర్మాత సహకరించాలని ఎ.పి. ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.ఎస్ రామారావు అన్నారు. ఛాంబర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పైరసీ సెల్‌పై పలురకాలుగా మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి బుధవారం నాడు ఫలింఛాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కె.ఎస్ రామారావు పలు విషయాలు వెల్లడించారు. నాలుగు ఏళ్లకు ముందు వీడియో పైరసీ సెల్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైందనీ, ముఖ్య అధికారిగా రిటైర్డ్ పోలీసు అధికారి కేశవరెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పలు వీడియో లైబ్రరీలపై దాడులు చేసి ఆరువేల కేసులు పెట్టామన్నారు.

చాలా వాటికి లైసెన్స్ లేవని, లైసెన్స్ లేని వారిని క్రిమినల్‌గా గుర్తించాలని వెల్లడించారు. అదేవిధంగా పైరసీ నివారణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, ఇదంతా ప్రతి దర్శక నిర్మాతకు తెలుసునని రామారావు తెలిపారు. కానీ కొంత మంది తమకు తెలీయదని వ్యాఖ్యానించడం వింతగా ఉందన్నారు.

సినిమా విడుదలైన నాటి నుంచి పైరసీ సెల్‌కు నిర్మాత లిఖిత పూర్వకంగా రాసి, ప్రతిక్షణం సెల్‌తో పాటు నిర్మాత గానీ వారికి సంబంధించిన వ్యక్తిగానీ వెంట ఉండాలని, అప్పుడే పైరసీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోగలమన్నారు. ప్రింట్లతో పాటు పైరసీ సెల్‌కు ఖర్చు పెట్టి చేతులు దులుపుకోవడం సరికాదని, మొన్ననే విశాఖలో ఛాంబర్ ఆప్ కామర్స్ జిల్లా ఎగ్జిబిటర్లు, పోలీసు అధికార్లతో సమావేశం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

ప్రతి జిల్లాలోనూ టీమ్ తయారు చేశామని, ఇప్పటివరకు ఎంతమందిని శిక్షించారనేదానికి బదులిస్తూ..... మూడన్నర ఏళ్ళలో 5,110 మందిపై కేసులు పెడితే అరెస్ట్ చేశారనీ, ఆర్గ్యుమెంట్లు, అప్పీల్ చేసుకోవడం వంటి వాటితోనే కాలం గడిచిపోతుందని అన్నారు.

స్థానిక నాయకుల ప్రమేయంతో కేసులు బద్దలవడంపై స్పందిస్తూ.... అవినీతిని అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అనీ ప్రైవేటు బాడీలు ఏమీ చేయడం లేవనీ, అసలు మనిషిలో అవినీతి అనేది ఉండకూడదని సూచించారు. న్యూజిలాండ్‌లో క్రైం అనేవి లేదని, అటువంటి సమాజంగా మనం మారాలని హితబోధ చేశారు. ఏది ఏమైనా గతంలో విచ్చల విడిగా జరుగుతున్న పైరసీని కొంతమేరకు నియంత్రించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పైరసీ సెల్ అధికారి కేశవరెడ్డి కూడా పాల్గొన్నారు.
About Writer
SELVI.M