"ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమికా!" పాటలు విడుదల
|
ముందుగా మురళీ మోహన్ మాట్లాడుతూ... పాటలు విన్నానని, చాలా బాగున్నాయని చెప్పారు. ఆర్కెస్ట్రాను డామినేట్ చేస్తూ... సాహిత్యం మరుగునపడుతున్న ఈ రోజుల్లో వినసొంపైన పాటలు ఈ చిత్రంలో ఉన్నాయని అన్నారు. రణగొన ధ్వనులు లేని సంగీతంతో కూడిన ఈ సినిమాలోని ఏడు చక్కగా ఉన్నాయని తెలిపారు.
కొత్తగా సినీ రంగంలో ప్రవేశించిన వారు తమ ప్రతిభను నిరూపిస్తేగానీ ఇండ్రస్టీలో నిలబడలేరని మురళీ మోహన్ హితవుపలికారు. దర్శకుడు చౌడప్ప ఈ చిత్రంతో సినీరంగంలో నిలబడతాడన్న నమ్మకం ఏర్పడిందని చెప్పారు. ఇకపోతే... ఇండస్ట్రీకి చీడలాంటి పైరసీని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, ఒరిజనల్ సీడీలనే కొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. థియేటర్లలోనే సినిమాలను చూసి నిర్మాతల్ని ప్రోత్సాహించండని ఆయన సూచించారు.
చలసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.... చాలా అర్థవంతమైన పాటలివని... ఇందులో మూడింటిని దర్శకుడే రాయడం మరో విశేషమని చెప్పారు. ఆయన ప్రతిభాపాటవాలే ఇందులో తెలిసిపోయాయని కొనియాడారు. చిత్రం కూడా విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వర చంద్ర, హాసిని హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. గీతాంజలి సినీ క్రియేషన్స్ పతాకంపై చౌడప్ప దర్శకత్వంలో కామినేని వెంకటేశ్వరరావు, ముప్పలనేని రత్నాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా... రమణ, ఎడిటర్... రవీంద్రబాబు, ఆర్ట్... రామకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.... చౌడప్ప.