అప్పుడే కాదు... ఇంకా టైముంది : రజనీకాంత్
|
తమ అభిమాన హీరోపై అంతలా ప్రేమాభిమానాలు పెంచుకున్న సదరు అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అలా కోరడానికి కారణం లేకపోలేదు. తాను నటించే చిత్రాల్లో మాట్లాడే ప్రతి డైలాగ్‌లో త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తాను అనే అర్థం స్ఫురించేలా రజనీకాంత్ మాట్లాడడమే ఆయన అభిమానుల్లో ఈ రకమైన ఆసక్తి రేపింది.
దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి అదిగో వచ్చేస్తున్నారు... ఇదిగో వచ్చేస్తున్నారంటూ తమిళనాట అప్పుడప్పుడూ వార్తలు రావడం రివాజుగా మారింది. ఇలా అందరూ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడుతున్నా నిజ జీవితంలో తన రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదీ చేయకపోవడం గమనార్హం.
|
అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చేస్తున్న విన్నపాలు మాత్రం ఆగిపోలేదు. దీంతో రజనీకాంత్ సోమవారం అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశంపై దేవుడు నిర్ణయించాలే తప్ప తన చేతిలో ఏమీ లేదంటూ పేర్కొన్నారు.
అయితే అభిమానుల విజ్ఞప్తి మేరకు తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయాన్ని ప్రస్తుతం తాను నటిస్తున్న 'రోబో' చిత్రం పూర్తయిన తర్వాత పరిశీలిస్తానని పేర్కొన్నారు. దీంతో 'ఎప్పుడొస్తానో తెలియదు... కానీ రావాల్సిన సమయంలో కరెక్టుగా వస్తాను' అంటూ సినిమాల్లో డైలాగ్ మాట్లాడే రజనీకాంత్ ప్రస్తుతం ఆ డైలాగ్‌ను జీవితంలో కూడా ఉపయోగిస్తున్నారని కొందరు చెప్పుకుంటున్నారు.