ఈ నవంబర్ ఒకటితో 35 ఏళ్లు పూర్తిచేసుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కేరళలో మణిరత్నం చిత్రం రావణ్ షూటింగ్‌లో పాల్గొంటూ తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌ల తల్లిదండ్రుల ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించడంతో రావణ్ చిత్ర షూటింగ్ రెండు రోజులు ఆలస్యంగా అక్టోబర్ 30 నుంచి కోచ్చి శివార్లలో జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా, సుప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఇది వీరురువురూ నటిస్తున్న మూడోచిత్రం కావడం విశేషం. కోచి పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు అవిరామంగా రావణ్ షూటింగ్ జరగనుంది. అభిషేక్ గతంలో యువ, గురు సినిమాలలో మణిరత్నం దర్శకత్వంలో నటించారు.
బాక్సాఫీసులో హిట్ కోసం పోరాడుతూ వచ్చిన అభిషేక్ లోని నటుడిని ఈ రెండు చిత్రాలు వెలికితీసి పేరు తెచ్చాయి. కాగా, ఐశ్వర్య పదేళ్ల క్రితం మణిరత్నం చిత్రీకరించిన ఇరువర్ తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. మణితో చివరిసారిగా ఆమె గురు చిత్రంలో నటించారు.
ఈ సంవత్సరం ఈ నీలి కళ్ల మాజీ ప్రపంచ సుందరికి పట్టిందల్లా బంగారమే అవుతోంది మరి. వృత్తిపరంగా చూస్తే జోథా అక్బర్, సర్కార్ రాజ్ సినిమాలలో ఆమె నటన ప్రశంసలు అందుకోవడమే కాక, వ్యాపారపరంగా కూడా ఇవి విజయం సాధించాయి.
పైగా ఆమె ఇటీవలే తన మామయ్య అమితాబ్, భర్త అభిషేక్‌లతో కలిసి విదేశాల్లో అన్‌ఫర్గెటబుల్ టూర్‌ను దిగ్విజయంతో ముగించుకుని వచ్చారు. అలాగే తన రెండవ తమిళ చిత్రమైన ఎందీరన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కథానాయికగా తొలి అవుట్ డోర్ సినిమాను విదేశాల్లో ముగించుకుని వచ్చారు కూడా.