ప్రారంభమైన "ఓ.. ఉదయం... ఓ.. సాయంత్రం"
|
వర్మ.ఎస్. ఏపూరి నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపుషాట్‌కు అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, కె.ఎస్. రామారావు స్విచ్ఛాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ఈ నెల 15 నుంచి డిసెంబర్ 5వరకు మొదటి షెడ్యూల్ జరుగుతుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ, కేరళలో జరిగే మూడో షెడ్యూల్ పాటల్తో చిత్రం పూర్తవుతుందని చెప్పారు.
భానుచందర్ మాట్లాడుతూ... హీరోహీరోయిన్లు ప్రేమించుకోవడం, విడిపోవడం, కలవడం ఇవన్నీ మామూలే.. కానీ దర్శకుడు కథ చెప్పిన విధానం బాగుంది. ఇందులో తాను కీలక పాత్ర పోషిస్తున్నానన్నారు. ప్రేమంటే ఏమిటి? జీవితమంటే ఏమిటి? అనేవి హీరోహీరోయిన్లకు తన పాత్ర ద్వారా తెలియజేస్తానని, మంచి చిత్రమవుతుందనే నమ్మకముందని భానుచందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ... కథకు సరిపడా టైటిల్ ఇదని, చక్కని పాటలు రాసే అవకాశం కలిగిందని చెప్పారు. ఉదయం చిగురించిన ప్రేమ వెలుగుతూ.. సాయంత్రానికి చీకటి కమ్ముకుంటుంది. ఇదే నేపథ్యంలో... రూపొందే కథ ఇదని వనమాలి అన్నారు.
ఈ చిత్రంలో చక్కని సందేశముందని దర్శకుడు తెలిపారు. తాను మాస్ తరహా పాత్ర పోషిస్తున్నానని హీరో ఆనంద్ అన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా, దర్శకత్వం... తను బాలక్, సంగీతం... విను థామస్, ఆర్ట్... వెంకట్.