ఆంటోని చరిత్ర ఆధారంగా "శిలువ నీడలో..."
|
క్రైస్తవులకు చెందిన ప్రొటెస్టెంట్‌ల గురువైన సెయింట్ ఆంటోని చరిత్ర ఆధారంగా "శిలువ నీడలో" అనే చిత్రంలో రూపొందుతోంది. తమిళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సి. విజయ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపడుతున్నారు. నేతాజీ నేతృత్వం వహిస్తున్నారు.
ప్రధాన పాత్రలు పోషిస్తున్న విజయ్ భాస్కర్, మల్లికాకపుర్‌లపై సోమవారం నాడు జూబ్లీహీల్స్‌లోని ఓ భవంతిలో ముహుర్తపు షాట్ చిత్రించారు. దీనికి నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టగా, సింధూరం నిర్మాత కృష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా గురించి వివరిస్తూ.... ఏసుక్రీస్తు బోధనల ప్రబోధకుడు, గురువైన సెయింట్ ఆంటోనీ గురించి తీస్తున్న సినిమా ఇదన్నారు. భక్తి భావంతో పాటు సామాజిక అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవాల్టి నుంచి వచ్చే నెల ఏడవ తేదీ వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతామని, పిదప కాకినాడ, ఉప్పాడ, తలకోనలో జరిగే షూటింగ్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ... తమిళంలో రూపొందిన "ఉన్నైవిడమాట్టేన్" అనే చిత్రం నుంచి నేతాజీని తెలుసునని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, సామాజిక స్పృహతో కూడిన "శిలువనీడలో"... వంటివి మరిన్ని రావాలని అభిలాషించారు. రచయితగా స్క్రీన్ ప్లే నిర్వాహకుడిగా నేతాజీ మంచి పేరుందని సాగర్ తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో సైరాభాను, శ్యామ్, వేణుమాధవ్, రామిరెడ్డి, కళ్యాణి, అపర్ణ, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా... గాదిరాజు శ్రీను, మాటలు... లతా నేతాజీ, ఆర్ట్... విజయకృష్ణ.