"నేనే ముఖ్యమంత్రినైతే" పాటల విడుదల
|
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి తొలి ప్రతిని చిత్ర దర్శక నిర్మాత నరేంద్రనాయుడికి అందించారు. అనంతరం సీడిని ఆర్. నారాయణమూర్తి విడుదల చేసి నిర్మాత శ్రేయోభిలాషి వ్యాపారవేత్త రామానాయుడికి అందజేశారు.
ఈ సందర్భంగా నరేంద్రనాయుడు మాట్లాడుతూ... తొలుత ఆంగ్ల సినిమాను నిర్మించానని, ప్రస్తుతం నిర్మించిన ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా తీర్చిదిద్దామన్నారు. చిన్నతనంలోనే టి. కృష్ణ, ఆర్. నారాయణమూర్తి చిత్రాలంటే ఇష్టంగా చూసేవాడినని, వాటిలో సామాజిక అంశాలతో కూడినవే ఎక్కువగా ఉంటాయని గుర్తు చేశారు. తాను చేస్తున్న ప్రస్తుత చిత్రం ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుందని, ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నట్లు నరేంద్ర నాయుడు తెలిపారు.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ... యువతరంపై మంచి సినిమాలు తెరకెక్కించే నరేంద్రనాయుడు తనకు చాలా కాలం క్రితమే తెలుసునని, కథలో బలముంటే మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఆడుతాయని, ఈ సినిమాకూడా అటువంటి విజయం సాధించాలని రమేష్ ప్రసాద్ ఆకాంక్షించారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు గతంలో ఒసామా హిన్ లాడెన్ మీద సినిమా తీశాడని, అతని ధైర్యాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ సినిమాలో ఆయనే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడో వేచి చూడాల్సిందేనని చెప్పారు.
సంగీత దర్శకుడు మహేష్ ఆపాల మాట్లాడుతూ... అన్ని పాటలు ఆకట్టుకునేలా ఉంటాయన్నారు. ఇంకా ఈ సినిమాలో సోనూసూద్, సునయన ఫెంర్నాండెజ్, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, సునీల్, భవాని, బబ్లూ తదితరులు నటించారు.