1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వ్యక్తిగత దూషణలకు పాల్పడే సంస్కారం నాది కాదు: పోసాని

వినోదం వెండితెర కథనాలు వ్యక్తిగత దూషణలు సంస్కారం నాది కాదు కించపరచలేదు పోసాని కృష్ణ మాదిగ లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్
WD
తన 15 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎవరినీ ఇంతవరకు కించపరిచేవిధంగా చిత్రాలు తీయలేదని నటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసానీ మాట్లాడుతూ... కృష్ణ మాదిగను ఉద్దేశించి "మెంటల్ కృష్ణ" చిత్రం తీస్తున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ విషయాన్ని చాలామంది అడిగారని, పైసలు కోసం సినిమాలు తీస్తుంటాం గానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడే సంస్కారం తనది కాదని స్పష్టం చేశారు.

ఇదొక లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని, ఆడవారి "మనసు" ముఖ్యమని చెప్పే కథతో ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలిచామన్నారు. అంతేతప్ప.. ఒక వర్గం, వ్యవస్థ, సమాజం కోసం పోరాటాలు చేస్తున్న కృష్ణ మాదిగను ఉద్దేశించి తీసిన సినిమా ఎంతమాత్రం కాదని పోసాని వెల్లడించారు.

ఇంకా పోసాని మాట్లాడుతూ... ఆ మధ్య తెలుగు సినిమాల్లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలని కృష్ణ మాదిగ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఈ చిత్రం తీశానన్న అభిప్రాయాన్ని చాలా మంది తన దగ్గర వ్యక్తం చేశారు.

సినిమాల్లో చెడును, అభ్యంతరకర దృశ్యాలను తొలగించేందుకు పోరాడే హక్కు పౌరుడిగా కృష్ణ మాదిగకు ఉందని పోసాని అన్నారు. అయితే తన చిత్రాన్ని కూడా ఆయనకు ఓ షో వేసి చూపిస్తానని, ఏమైనా అలాంటి దృశ్యాలుంటే కట్ చేస్తాననన్నారు.

సినిమా గురించి మాట్లాడుతూ... చాలా సినిమాల్లో హీరోహీరోయిన్‌కు అండగా నిలబడి ఆమె ఆస్తి, శీలం, ప్రాణం, జీవితాన్ని కాపాడుతుంటాడు. అయితే ఈ సినిమాలో కథానాయకుడు హీరోయిన్ మనసు కాపాడతాడని పోసాని అన్నారు.

ఈ చిత్రం ద్వారా అన్నిటికంటే "మనసు" ఉండాలనే సందేశాన్ని చెబుతున్నామని వెల్లడించారు. ఈ విషయం ఆమెకు క్లైమాక్స్‌లో గానీ అర్థం కాదని, చిత్రానికి ముందుగా "ఆడవాళ్లు నవ్వితే శుభం" అనే టైటిల్‌ను అనుకున్నామని, కథ పూర్తి రూపానికి వచ్చాక హీరో పాత్రకున్న ప్రాధాన్యత రీత్యా "మెంటల్ కృష్ణ" అని పేరును ఖరారు చేశామని పోసాని తెలిపారు.

ఇకపోతే... సత్యకృష్ణను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ.. పోసాని టటైల్ రోల్ పోషించిన చిత్రం "మెంటల్ కృష్ణ". మోహన్ వడ్లపట్ల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
About Writer
SELVI.M