కోట్ల హృదయాల్లో నిలిచిపోయిన సుస్వరం ఎస్.జానకికి ప్రముఖ గాయని సుశీల తన పేరిట నెలకొల్పిన జాతీయ అవార్డుతో సత్కరించే అద్భుతమైన అరుదైన దృశ్యం కళ్లలోనే నిలిచిపోయింది. సంగమ్ అకాడమీ నిర్వహణలో పి. సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో సినీ నేపథ్య గాయని ఎస్. జానకికి, పి. సుశీల తొలి జాతీయ అవార్డు, లక్ష నగదు, నూతన వస్త్రాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొణిజేటి రోశయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక కళాకారిణిని మరో కళాకారిణిని సత్కరించే ఈ సంప్రదాయం ఇంకా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ మాట్లాడుతూ... తానూ సినిమా నటుడినేనని, వాగ్గేయకారుడినే, ఎస్పీతో కలిసి పాటలు కూడా పాడానని గుర్తు చేశారు. ఈ వేదికపై ముగ్గురు బిడ్డలున్నారని, అందులో ఒకరు సుశీల, మరొకరు జానకి, ఇంకొకరు బాలసుబ్రహ్మణ్యమని ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఎం.పి. సుబ్బరామిరెడ్డి సుశీల ట్రస్ట్‌కు రూ.5లక్షలు విరాళంగా ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పి. సుశీల మా ఇంటి ఆడపడుచని చెప్పారు. బాలు, జానకిలు నటీనటులకు తగినట్లు గీతాలను ఆలపించి మెప్పించే సత్తా ఉన్న గొప్ప గాయకులని అభినందించారు. 90 ఏళ్ల వయసులో 9 ఏళ్ల స్వరంతో పాడగల అద్భుతమైన స్వరం జానకి సొంతమని కొనియాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తొలి నేపథ్యగాయని బాలసరస్వతి దేవి, అలనాటి గాయని జమునారాణి, నిర్మాత ఆర్వీ రమణమూర్తి, నేత నన్నపనేని రాజకుమారి, గాయకుడు రామకృష్ణ, పలువురు సినీ ప్రముఖులు జానకిని అభినందించారు.