1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ

వినోదం వెండితెర కథనాలు కాల్సెంటర్ ఫేమ్ వంశీకృష్ణ  హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అక్షయ్ ఎంటర్టైన్మెంట్స్
"కాల్‌సెంటర్" ఫేమ్ వంశీకృష్ణ కథానాయకుడిగా...అక్షయ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కె.బి. రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ దగ్గర పనిచేసిన దాసరి బ్రహ్మేంద్ర డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కథ, కథనం ప్రేక్షకుడిలో ఆసక్తిని పురిగొల్పుతుంని దర్శకుడు వెల్లడించారు.

కథ అనుకున్నప్పుడే వంశీకృష్ణ పాత్రకు సరిపోతాడని భావించామని, కథ విన్నాక ఆయన ఎంతగానో ఇన్‌స్పైర్ అయ్యారని దాసరి బ్రహ్మేంద్ర వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్‌ను ప్రారంభిస్తామని, హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నామని తెలిపారు.

నిర్మాత కె.బి. రాజు కథ గురించి చెబుతూ... కుటుంబమంతా ఆశలు పెట్టుకున్న ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వారి పరిస్థితి ఏమిటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అన్న పాయింట్‌తో రూపుదిద్దుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదన్నారు.

సంగీత దర్శకుడు ఎస్. ఎ. ఖుద్దూస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రెండు పాటలున్నాయని, కథాపరంగా రీరికార్డింగ్ అవకాశమున్న చిత్రమిదని చెప్పారు.

హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలుగులో తనకిది మూడో చిత్రమని, రెండు భాషల్లో రెండవదని, రొటీన్ ప్రేమకథగా కాకుండా దర్శకుడు చేస్తున్న కొత్తప్రయోగమిదని పేర్కొన్నారు. అక్షయ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తాము తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని చిత్ర సమర్పకుడు పోతుల ప్రభాకర్, సహనిర్మాత పి.యాదగిరి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా.. వెంకటే ఆర్. ప్రసాద్, పాటలు.. రామజోగయ్య శాస్త్రి, కందికొండ.