1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"దొంగలబండి" ఆడియో విడుదల

వినోదం వెండితెర కథనాలు దొంగలబండి ఆడియో విడుదల అల్లరి నరేష్ తాన్య జిఎస్కె నెట్వర్క్ పతాకం
WD

అల్లరి నరేష్, తాన్య హీరోహీరోయిన్లుగా జి.ఎస్.కె. నెట్‌వర్క్ పతాకంపై జి.ఎస్.కె. నాయుడు నిర్మిస్తున్న చిత్రం "దొంగలబండి". రచయిత వేగేశ్న సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన డి. రామానాయుడు ఆడియోను ఆవిష్కరించి, ఇ.వి.వి. సత్యనారాయణకు అందించారు. అనంతరం ఆడియో కేసెట్‌‌ను సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి విడుదల చేయగా నరేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... సినిమా మార్కెట్ ప్రస్తుతం చెప్పుకోదగ్గట్టు లేకపోయినా నరేష్ సినిమాలు మాత్రం బాగున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయన్నారు.

నరేష్ హీరోగా చేసే చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహిస్తున్న నిర్మాతలు చాలా సంతోషంగా ఉంటున్నారని రామానాయుడు చెప్పారు. పాటలు చాలా క్యాచీగా ఉన్నాయని, రాజశేఖర్ బాణీలు ఆకట్టుకుంటాయని, ఈ చిత్ర పాటలు హిట్ అవుతాయన్న నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు. సతీష్ మంచి రచయిత అని, తన చిత్రాల్లో కామెడీ పంచ్‌లు బాగా రాశాడని రామానాయుడు చెప్పారు.

"దొంగలబండి" కథ విన్నానని, చాలా బాగుందని, నరేష్ చిత్రాల్లో బడ్జెట్ ఎక్కువయినా నిర్మాత జె.కె. నాయుడు వెనుకాడకుండా తీయడం అభినందనీయమని, ఇతర నటీనటులు బాగా చేశారని ఇ.వి.వి. సత్యనారాయణ కొనియాడారు. సంగీత దర్శకుడు రాజశేఖర్ సంగీతం చాలా బాగుందని ప్రశంసించారు.

WD

తాను ఈ చిత్రంలో నైజాం నవాబు దగ్గర పనిచేసే సేనాపతి పాత్రను పోషించానని, క్లైమాక్స్ రాజమండ్రి సమీపంలో అడవుల్లో చిత్రీకరించారని, ప్రస్తుతం ఆర్థిక మాంద్యమున్నా రిలీఫ్‌గా ఇటువంటి చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని నటుడు అశోక్ కుమార్ పేర్కొన్నారు.

నరేష్ చిత్ర నిర్మాతలకు ఉపయోగపడే హీరో అవుతాడని ఆయన తెలిపారు. ఈ చిత్ర టైటిలే సంగం మార్కులు కొట్టేసిందని, త్వరలో తాను మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని "బ్లేడ్‌బాబ్జీ" దర్శకుడు దేవీప్రసాద్ చెప్పారు.

సంగీత దర్శకుడు వల్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ.. తొలుత తనకు నరేష్ నుంచి ఫోన్ వచ్చిందని, ఈ చిత్రానికి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, తన పరిమితి మేరకు చక్కగా బాణీలు సమకూర్చానని తెలిపారు.

నరేష్ మాట్లాడుతూ... ఈ సంవత్సరంలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, తొట్టిగ్యాంగ్ నుంచి సతీష్ తనతో ఏడు సినిమాలకు పనిచేశాడని చెప్పారు. ఇక పాటలు విషయానికొస్తే చెప్పనవసరమే లేదని, రాజశేఖర్ మొదటైసారైనా మంచి బాణీలు సమకూర్చాడని వెల్లడించారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ... "నో లాజిక్ ఓన్లీ ఫన్ మ్యాజిక్" అనే కాప్షన్‌కు తగినట్లుగా ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రముంటుందని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు ఎన్. శంకర్, రాధాకృష్ణ, చంద్రమహేష్, చలపతిరావు తదితరులు మాట్లాడారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.

బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ... ఎస్. అరుణ్ కుమార్, సంగీతం... వల్లూరి రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.. నరేష్ ఉత్తరాది, సిహెచ్‌వి. శర్మ, గోరింట్ల లోకేష్ నాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం.. వేగేశ్న సతీష్.
About Writer
SELVI.M