1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వైజయంతిమాలకు "అక్కినేని" అవార్డు

వినోదం వెండితెర కథనాలు వైజయంతిమాల అక్కినేని అవార్డు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీలు సెలక్షన్
WD

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన అక్కినేని అవార్డును ఈ ఏడాది ప్రఖ్యాత నటీమణి డాక్టర్ వైజయంతి మాలకు అందజేయనున్నారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గత మూడేళ్ళుగా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వివరాలను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అక్కినేని నాగేశ్వరరావు తెలియజేస్తూ... ప్రస్తుతానికి ఈ ఫౌండేషన్ ట్రస్టీలు, సెలక్షన్ కమిటీవారు లేనందున తానే ఈ అవార్డు వివరాలను వెల్లడిస్తున్నానని చెప్పారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సమయంలో తన మనసులో ఇలాంటి అవార్డు పేరిట ఒకటి నెలకొల్పాలని భావించానని చెప్పారు. ఆ అవార్డుకు వచ్చిన లక్ష రూపాయలతోపాటు తాను నటించి సంపాదించిన దాంట్లో కొంతమొత్తాన్ని పోగుచేసి ఒక కోటి రూపాయలతో అవార్డును ప్రారంభించానని తెలిపారు.

ట్రస్ట్ ఫౌండర్ తానైతే, తన కుమారుడు వెంకట్ ట్రస్టీగా ఉన్నాడని అక్కినేని తెలిపారు. అందులో తన అల్లుడు కూతుళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. ఈ అవార్డు తొలి సంవత్సరం దేవానంద్‌కు, మలి సంవత్సరం షబనా ఆజ్మీకి, గత ఏడాది అంజలీదేవికి ఇచ్చామని తెలిపారు. తొలి సంవత్సరం ఈ అవార్డుకు మూడు లక్షల రూపాయలను అందజేశామని చెప్పారు. అనంతరం దానిని నాలుగు లక్షలకు పెంచామని అక్కినేని వివరించారు.

ఈ అవార్డు ఎంపికకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రాథమిక సూత్రాల ఆధారంగా జరుగుతాయని నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం మన దేశంలోని వాళ్లకే ఆ అవార్డును ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో తన వారసులు అంతర్జాతీయ సినిమా ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు అక్కినేని వెల్లడించారు.

ఈ అవార్డు కింద ఈ ఏడాది కూడా నాలుగు లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తున్నామని చెప్పారు. వైజయంతీమాల చిన్నతనం నుంచే నటిగా జీవితాన్ని ప్రారంభించి, తర్వాత హిందీ సినిమాల్లో పెద్దతారగా వెలుగొందారని తెలిపారు. మంచి నర్తకిగా పేరుగాంచిన వైజయంతిమాల పేరిట ఓ డాన్స్ స్కూల్ కూడా నడుస్తోందని అక్కినేని అన్నారు.

వైజయంతి మాల సినీపరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆమెకు అందజేయనున్నామని నాగేశ్వర రావు చెప్పారు. జనవరి 10వ తేదీన జూబ్లీహాలులో ఈ అవార్డు ప్రధానం కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నారని తెలిపారు.

కాగా... భవిష్యత్‌లో ఈ ట్రస్టుకు ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తే... దానిని ఉపయోగించి సేవలు మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. తనకు దేశ, విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులున్నారని ఈ సందర్భంగా తెలిపారు. కానీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం పెట్టడంలేదన్నారు. ఈ సందర్భంగా ప్రభు అనే జర్నలిస్టు పదివేల నూట పదహారు రూపాయలను విరాళంగా ప్రకటించారు.
About Writer
SELVI.M