అఖిల్, తమన్నా జంటగా "కళాశాల"
|
ఈ రోజు కళాశాలల్లో నిరుపేదల నుంచి ధనవంతులైన విద్యార్థుల వరకు తమ విలాసాల కోసం ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టడాన్ని మనం చూస్తునే ఉన్నాం. పేదవాడిదో గొడవైతే డబ్బున్న వాడిది మరో రకమైన గొడవ. ఇలాంటి స్టూడెంట్స్ జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో "కళాశాల" అనే చిత్రం రూపొందుతోంది. "ప్రేమిస్తే" చిత్రాన్ని తీసిన శక్తివేల్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
తమిళనాడులోని ధర్మపురి పట్టణంలోని ఓ కాలేజీలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా చేసుకొని కొత్త నటీనటులతో తమిళంలో "కల్లూరి" (కళాశాల) పేరుతో సినిమాను నిర్మించారు. హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రొడక్షన్ విభాగంలో అనుభవమున్న ఎం.వి.గోపాలరావు నిర్మాతగా మారి అనువదిస్తున్నారు.
జ్యోతి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి గోపాలరావు మాట్లాడుతూ... మానవ జీవితంలో ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే అంశాన్ని ఈ సినిమాలో ఇతివృత్తంగా చూపిస్తున్నట్టు చెప్పారు. గతంలో "ప్రేమిస్తే" వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శక్తివేల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని వెల్లడించారు.
కాలేజీలో కాలుమోపిన యువతీ యువకులు ముందుగా తామెవరో ఏమిటో పరిచయం చేసుకుంటారు. కాలం తెచ్చే మార్పుల్లో కొందరు ఒకరికొకరు పరిచయమవుతారు. అయితే ప్రేమికులు కావడానికి ముందు మనసుల్లో ప్రేమ ఉన్నా దాన్ని బైటకు తెలియజెప్పకుండా మనసులోనే దాచుకుంటారు.
అయితే ఆ ప్రేమ ఎప్పుడు ఎలా బయటికి వచ్చి ఒకరికొకరు ఎలా తోడవుతారన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని గోపాలరావు వివరించారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మిక్సింగ్ జరుగుతోందని చెప్పారు. త్వరలో తొలికాపీని సిద్ధం చేసి, ఆడియోను ఈనెల ద్వితీయార్థంలో, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తమన్నా, అఖిల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మిగిలిన అన్ని పాత్రలను కొత్తవాళ్ళే చేశారని గోపాలరావు చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి మాటలు... శ్రీరామకృష్ణ, పాటలు.. భువనచంద్ర, శివగణేష్, సాహితి, వనమాలి, సంగీతం... జోష్వాశ్రీధర్, ఛాయాగ్రహణం... చెళియన్, ఎడిటింగ్.. శశికుమార్, కళ..మైల్ కృష్ణన్, నిర్మాత.. ఎం.వి. గోపాలరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. బాలాజీ శక్తివేల్.