ముంబై పేలుళ్ల నేపధ్యంతో సినిమా టైటిళ్లు
|
"టెర్రర్ ఫ్రమ్ అరేబియన్ సీ", "ఆపరేషన్ సైక్లోన్".... వంటి 20 సినిమా టైటిళ్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నాయని భోగట్టా. సినిమా టైటిళ్ల రిజిస్ట్రేషన్ సంగతి ఎలా ఉన్నా... రూపుదిద్దుకోబోయే చిత్రాలను మాత్రం ముంబై పేలుళ్లనాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు అందించటానికి పలు అగ్రశ్రేణి దర్శకులు స్క్రిప్టు కూడా సమర్పించారు. మరికొందరు ఇదే పనిలో ఉన్నారు.
దేశంలో ఏదైనా పెను సంఘటన సంభవించినపుడు దాని ఆధారంగా చిత్రాలను రూపొందించటం మామూలే అంటున్నాడు ఓ సుప్రసిద్ధ డాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్. అయితే కొంతమంది దర్శక నిర్మాతలకు మాత్రమే ఇటువంటి సున్నిత అంశాలను ఇతివృత్తంగా చేసుకుని వెండితెరపై సమర్థవంతంగా అందించగల సత్తా ఉందంటున్నాడు.
తీవ్రవాదం నేపధ్యంతో చిత్రాన్ని రూపొందించేటపుడు పెచ్చరిల్లిన హింస, భయానక దృశ్యాలను సందర్భానుసారంగా వాడుకుంటూనే సమాజానికి ఓ చక్కటి సందేశాన్నివ్వగల సమర్థత వారికి మాత్రమే ఉందంటున్నాడు.
ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... ముంబై పేలుళ్ల నేపధ్యంగాగల టైటిళ్లకోసం పలువురు అగ్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్న మాట నిజమేనన్నారు. దరఖాస్తు చేసుకున్న టైటిళ్లను పరిశీలిస్తున్నారనీ, వాటిలో ఎన్ని టైటిళ్లకు ఆమోదం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కనుక రాబోయే రోజుల్లో మన ముందుకు కనీసం డజను చిత్రాలు ముంబై పేలుళ్ల నేపధ్యంతో వస్తాయన్నమాట.