నేల రాలిపోతున్న ''సినీ'' తారలు
మొన్న.. సిల్క్‌స్మిత, దివ్యభారతి. నిన్న.. ప్రత్యూష. నేడు.. భార్గవి. వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా హత్యకు గురయ్యారు. తమ అందచందాలతో సగటు సినీ ప్రేక్షకుడుని ఆలరించిన సినీ తారలు అతికొద్దికాలంలోనే శవాలుగా మారారు. తాజాగా 'అష్టాచమ్మా' ఫేం.. భార్గవి అనుమానాస్పదంగా హత్యకు గురైంది. తొలి చిత్రంలోనే మంచి నటనతో చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకున్న భార్గవి.. అకస్మాత్తుగా నేలరాలడం వర్ధమాన సినీ తారలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమను ఒకసారి పరికించి చూస్తే.. పలువురు ప్రముఖ తారలు హత్యలకు గురయ్యారు. ఇది సినీ వర్గాలను ఒకింత ఆశ్చర్యం, దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నాటి ప్రత్యూషాలాగే వెండితెరపై ఎదుగుతున్న గుంటూరు తెలుగుపిల్ల భార్గవి హత్యకు గురికావడం సినీ వర్గాలను విస్మయానికి లోనుచేసింది. ప్రత్యూష తరహాలోనే భార్గవి కూడా హత్యకు గురికావడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పలువురు టీవీ యాంకర్లు, వర్ధమాన సినీ నటులు హత్యకు గురికావడం ఎక్కువైంది. వీటికి గల కారణాలను మాత్రం తెలుసుకోవడంలో అటు పోలీసు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు
పూర్తిగా విఫలమవుతున్నాయి. వర్ధమాన కళాకారుల్లో చైతన్యం తీసుకొచ్చి వారిలో అవగాహన పెంచుతున్నట్టు సినీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే.. వారి మాటలు వార్తలకే పరిమితమవుతున్నాయనే నిజం భార్గవి ఆత్మహత్యతో రుజువైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, శ్రీవెంకటేశ్వర నగర్ బస్తీలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో భార్గవి శవమై తేలడం మిస్టరీగా మారింది. ఆమె శవం పక్కనే, భర్తగా భావిస్తున్న (పేర్కొంటున్న) ప్రవీణ్ కుమార్ కూడా శవంగా పడివుండటం ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా.. పదహారణాల తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, మధ్యలోనే తనువు చాలించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని నష్టంగా పలువురు భావిస్తున్నారు.