1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణలో "సత్యమేవజయతే"

వినోదం వెండితెర కథనాలు పాటల చిత్రీకరణ సత్యమేవజయతే రాజశేఖర్ సంజన నీతుచంద్ర జీవిత
WD

రాజశేఖర్, సంజన, నీతుచంద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సత్యమేవజయతే". సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శివానీ శివాత్మిక మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలను అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకత్వంలో రాజశేఖర్, నీతుచంద్రలపై రామోజీ ఫిలింసిటిలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. "ఎవడైతేనాకేంటి..?" చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించానని, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో "సత్యమేవజయతే" కథ రాశానని అన్నారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని రాజశేఖర్ తెలిపారు.

జీవిత మాట్లాడుతూ... ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఓ బర్నింగ్ ప్రాబ్లమ్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. టెర్రరిజం, బాంబు బ్లాస్టులు, అమ్మాయిలను టీజ్ చేయడం వంటి వర్తమాన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించామని ఆమె వెల్లడించారు.

ప్రతిరోజూ మనం పేపర్లో చూసే వార్తలే ఈ సినిమాలో ఉంటాయని, పోలీసు వ్యవస్థలోని ప్లస్, మైనస్ పాయింట్లను ఎత్తిచూపామని జీవిత అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఒక పాట మినహా సినిమా పూర్తయిందని, ఆ పాటను కూడా నాలుగైదు రోజుల్లో చిత్రీకరిస్తామని జీవిత వెల్లడించారు. రీరికార్డింగ్ స్కోప్ ఉన్న ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

ఇకపోతే... ఈ చిత్రానికి నాని సంగీతం అందించారని జీవిత తెలిపారు. త్వరలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుందని ఆమె చెప్పారు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ... తమిళంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇంతవరకూ రాలేదని, రాసుకున్న ఓ కథను రాజశేఖర్‌కు వినిపించానని, ఆ కథ నచ్చి రాజశేఖర్ తన చిత్రంలో హీరోగా చేస్తానని అంగీకరించారని తెలిపారు.

నీతుచంద్ర మాట్లాడుతూ.. తానిందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నానని, నిజజీవితంలో నేర్చుకున్న కరాటే ఇందులో యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఉపయోగపడిందని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో శివాజీ, సాయికిరణ్, శివారెడ్డి, షాయాజీ షిండే, అతుల్ కులకర్ణి, మిలింద్ సోమన్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించారు.
About Writer
SELVI.M