"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" లోగో ఆవిష్కరణ
|
"బాయ్స్" బాయ్ సిద్ధార్థ, "హ్యాపీడేస్" ఫేం తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.
బ్రహ్మానందం, సిద్ధార్థ ఈ సినిమా లోగోను రామానాయుడు స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... మానవీయవిలువలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించనున్నారని చెప్పారు. ఇందులో తాను క్రికెట్ ప్లేయర్‌గా ప్రేక్షకులను అలరించనున్నానని బ్రహ్మానందం తెలిపారు. పతాకసన్నివేశంలో సిద్ధార్థ అద్భుతంగా నటించాడని, ప్రతిభ ఎక్కడ ఉందో నిర్మాత బుజ్జి అక్కడ ఉంటారని హాస్యబ్రహ్మ కొనియాడారు.
చిత్ర నిర్మాణ సారధి డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధార్థ ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాడని, యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని చెప్పారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారని, జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
హీరో సిద్ధార్థ మాట్లాడుతూ... తన చిత్రానికి తానే లోగోను ఆవిష్కరించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆడియో ట్రెండ్ సృష్టిస్తోందన్న నమ్మకముందని సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. కథ చెప్పినప్పుడే బడ్జెట్‌లో పరిమితులు లేకుండా నిర్మాత ఎంతగానో సహకరించారని, సంగీత దర్శకుడిగా శంకర్, ఎషాన్‌లొయ్‌ని అడిగిన వెంటనే ఖర్చుకు ఏమాత్రం రాజీపడకుండా అంగీకరించారని దర్శకుడు వెల్లడించారు. మొత్తానికి తన కల నెరవేరిందని, చెప్పింది... చెప్పినట్లు తీయగలిగానని, ఇటీవలే సురేష్ బాబు రషెస్‌ను చూసి అభినందించారని తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, రఘుబాబు, సుధ, హేమ, కరుణ, రవళి, సామ్రాట్, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు... అబ్బూరి రవి, రచన సహకారం... హరీష్ శంకర్, స్క్రీన్‌ప్లే.. దీపక్ రాజ్, విక్రమ్ సిరి, కెమేరా... విజయ్ కె. చక్రవర్తి.