1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సినీ పరిశ్రమను వీడే ప్రసక్తే లేదు: కవిత

వినోదం వెండితెర కథనాలు సినీ పరిశ్రమ కవిత తెదేపా తీర్థం రాజకీయ రంగ ప్రవేశం చంద్రబాబు చిరంజీవి ఎన్టీఆర్
WD

తనను నటిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేసిన సినీ పరిశ్రమను వదిలేది లేదని ప్రసిద్ధ నటీమణి కవిత స్పష్టం చేసింది. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఈ సందర్భంగా పరిశ్రమకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసే సభను మంగళవారం నాడు ఏర్పాటు చేసింది.

ఈ సభలో కవిత మాట్లాడుతూ... 25ఏళ్ల క్రితమే మంచినటిగా పేరు సంపాదించి, మద్రాసు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తనను ఈ ఇండస్ట్రీ సాదరంగా ఆహ్వానించిందని చెప్పారు. తనను అంతగా గుర్తించిన ఇండస్ట్రీకి సేవాచేయాలని తలంపుతో ఇండస్ట్రీలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫైటర్స్, లైట్‌మెన్, మేకప్‌మేన్ వంటి అసోసియేషన్లకు 85లోనే 50వేల రూపాయల విరాళాన్ని అందజేశానని కవిత చెప్పారు.

ప్రస్తుతం తాను రాజకీయ రంగంలో ఉన్నా, తన శక్తిమేరకు వారికి తగు సహకారాన్ని అందిస్తానని ఆమె వెల్లడించారు. 11వ ఏటనే సినీరంగ ప్రవేశం చేశానని, "సిరిసిరిమువ్వ" నుంచి "హ్యాపీడేస్" వరకు 300 సినిమాలకు పైగా నటించిన తన నటజీవితాన్ని ఈ సందర్భంగా ఆమె విశ్లేషించుకున్నారు.

అంజలీదేవి, జగ్గయ్య, నాగభూషణం, రామారావు, నాగేశ్వరరావు వంటి అగ్రజుల సరసన నటించే భాగ్యం కల్గించిన ప్రతి దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కవిత అన్నారు. ప్రజల మనస్సులో చోటు సంపాదించడమే తాను సంపాదించిన ఆస్తిగా ఆమె పేర్కొన్నారు. రాజకీయంలో ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నానని, అప్పుడే సామాన్య ప్రజానీకానికి సేవ చేయగలమని కవిత స్పష్టం చేశారు.

తెలుగుదేశంలో ప్రవేశించడానికి గల కారణాలను ఆమె వివరిస్తూ... ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా పేర్కొన్నారు. అప్పట్లో "లాయర్ విశ్వనాథ్" చిత్రంలో ఆయన చెల్లెలుగా నటించానని, క్రమశిక్షణ పద్ధతిగల నటుడు ఎన్టీఆర్ అని, ఆ తర్వాత అటువంటి నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి చంద్రబాబు ఒక్కడేనని అన్నారు. అందుకే తెదేపాలో చేరానని కవిత వివరించారు.

ప్రజారాజ్యం పార్టీపై కవిత స్పందిస్తూ... ప్రజారాజ్యం ఎల్.కె.జి లెవల్ పార్టీ అని, తెదేపా హౌస్‌సర్జన్ చదివిన పార్టీ అని అభివర్ణించారు. ఎన్టీఆర్‌తోనూ ఆయన పార్టీతోనూ, ఏ పార్టీని, ఎవరినీ పోల్చలేమని చెప్పారు. ఎన్టీఆర్‌కు అన్ని విషయాల్లో అవగాహన ఉండేదని, చిరంజీవి ఇంకా ఎల్.కె.జి లెవలేనని కవిత దుయ్యబట్టారు.

సినిమా వారికి రాజకీయాలు అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... రీగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్‌తో పాటు ఎందరో అది అవసరమని నిరూపించుకున్నారని కవిత అన్నారు. ఒకరకంగా పార్టీలోని వారికంటే బయటవారికి ఎక్కువ విషయాలు తెలుస్తాయని ఆమె చెప్పారు.

కృష్ణాజిల్లాలో సీటు ఆశిస్తున్నారా? అన్న ప్రశ్నకు కవిత స్పందిస్తూ... ఆ వార్త ఇంకా వినలేదని, పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదని, ఇచ్చిన పనిని నెరవేర్చడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.

సహనటి రోజా గురించి చెబుతూ... అహంభావం లేని నటి అని, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తనీ, ఇద్దరూ కలిసి పార్టీ కృషి చేస్తామన్నారు.
About Writer
SELVI.M