1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హిందీ "గజినీ" విడుదలకు మద్రాసు కోర్టు గ్రీన్‌ సిగ్నల్

వినోదం వెండితెర కథనాలు హిందీ గజినీ విడుదల కోలీవుడ్ చుక్కెదురు అమీర్ఖాన్ అసిన్ అల్లు అరవింద్ జోధాఅక్బర్ సింగ్ ఈజ్ కింగ్
బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ "గజినీ" చిత్ర విడుదలకు నోచుకోనుంది. హిందీ"గజినీ" చిత్రాన్ని తమిళనాడులో తొలుత విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే. "గజినీ" సినిమా విడుదలను నిలిపేస్తూ మద్రాసు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయగా, బుధవారం స్టేను తొలగించింది.

కోలీవుడ్ సూపర్ హిట్ గజినీకి రీమేక్ అయిన అమీర్ సినిమా గురువారం (క్రిస్మస్) విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తన నుంచి ఎలాంటి హక్కులు తీసుకోకుండానే చిత్రాన్ని నిర్మించారంటూ తమిళ గజినీ నిర్మాత సేలం చంద్రశేఖర్ మద్రాసు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చిత్ర విడుదలను నిలిపివేయాల్సిందిగా న్యాయమూర్తి పి.ఆర్.శివకుమార్ ఉత్తర్వులిచ్చారు.

దీంతో షాక్‌కు గురైన హిందీ గజినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మద్రాసు కోర్టు విధించిన స్టేను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ... అప్పీలు చేసుకున్నారు. స్టే తొలగించని పక్షంలో దేశవ్యాప్తంగా చిత్ర విడుదలను ఆపేయాలని తొలుత భావించారు.

ఇదిలా ఉండగా... ఈ ఏడాది "గజినీ" విడుదలకు బ్రేక్ పడినట్లే గతంలో రెండు బాలీవుడ్ చిత్రాల రిలీజ్‌కు కూడా అంతరాయం కలిగింది. ఇందులో భాగంగా... ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం "జోధాఅక్బర్" విడుదలకు రాజ్‌పుత్‌లు బ్రేక్ వేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. "జోధాఅక్బర్"ను రూపొందించారంటూ రాజ్‌పుత్‌లు ఆరోపించారు. దీంతో "జోధాఅక్బర్" రాజస్థాన్‌లో విడుదలకు నోచుకోలేదు.

అదేవిధంగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "సింగ్ ఈజ్ కింగ్" చిత్ర విడుదలకు చుక్కెదురైంది. సిక్కు మతస్థులను హేళన చేసే విధంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారంటూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపించడంతో ఈ చిత్రం విడుదల చేయడంలో జాప్యం జరిగింది. అనంతరం "సింగ్ ఈజ్ కింగ్" చిత్ర ప్రమోస్‌లను సిక్కుల కమిటీ వీక్షించిన అనంతరం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా అమీర్ "గజినీ" విడుదలకు కూడా తమిళనాడులో బ్రేక్ పడింది. తమిళ "గజినీ" నిర్మాత చంద్రశేఖర్ వద్ద ఎలాంటి హక్కులు పొందకనే హిందీలో రీమేక్ చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఆ చిత్ర విడుదలపై కోర్టు స్టే విధించింది. అయితే ఈ స్టేను ఎత్తివేయాలని దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపి స్టే ఎత్తివేసింది.
About Writer
SELVI.M