గీతాకృష్ణ దర్శకత్వంలో "కాఫీబార్"
|
"కోకిల", "సంకీర్తన" దర్శకుడు గీతాకృష్ణ నేతృత్వంలో "కాఫీబార్" అనే చిత్రం రూపుదిద్దుకోనుంది. బ్లూఫాక్స్ సినిమా పతాకంపై గీతాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఆయనే సంగీతం సమకూర్చడం విశేషం. వనమాలి రాసిన సాహిత్యంలో ఇప్పటికే మూడు పాటలకు రికార్డింగ్ కూడా పూర్తి చేశారు.
ఇళయరాజా సంగీత సారథ్యంలోనే తను చిత్రాలన్నీ తెరకెక్కాయని, ఆయనతో అనేకసార్లు మ్యూజిక్ సిట్టింగ్‌లో పాల్గొన్నానని గీతాకృష్ణ చెప్పారు. కాలేజీ రోజుల్లోనే గాయకుడిగా, సంగీతదర్శకుడిగా పలు కార్యక్రమాలు నిర్వహించానని గీతాకృష్ణ అన్నారు.
కొత్తపాత నటీనటుల కలయికతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలుంటాయని ఆయన తెలిపారు. కొత్త కథనం, మంచి సంగీతం, పాట, నయనానందకరం కల్గించే మంచి ఫోటోగ్రఫీ ఈ చిత్రంలో ఉన్నాయని గీతాకృష్ణ వెల్లడించారు. ప్రేమతో పాటు ఎమోషనల్స్ ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 15 నుంచి ప్రారంభమౌతోందని ఆయన చెప్పారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ... గీతాకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన "టైమ్" సినిమాతో తన కెరీర్ ప్రారంభమైందన్నారు. ఆయన చిత్రాల్లో సాహిత్యానికి పెద్దపీఠ వేస్తారని, పూర్తివినోదాత్మకంగా సాగే "కాఫీబార్" సినిమా తప్పకుండా కొత్తట్రెండ్‌ను సృష్టిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమేరా... ప్రకాష్, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం... గీతాకృష్ణ.