1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సభ్యులు కాకపోతే సహకారం ఉండబోదు: "మా"

వినోదం వెండితెర కథనాలు సభ్యులు సహకారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ మురళీమోహన్
WD

సినిమాల్లో ముఖ్యపాత్రధారులంతా తప్పనిసరిగా "మా" సభ్యత్వం తీసుకోవాలని, లేకపోతే వారికి ఇటు "మా" నుంచి గానీ, అటు నిర్మాతల మండలి నుంచి గానీ ఎటువంటి సహకారం ఉండబోదని "మా" అధ్యక్షుడు మురళీమోహన్ స్పష్టం చేశారు.

పారితోషికాలు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటీనటులు "మా"లో సభ్యులయితే వారి సమస్యలు పరిష్కరించడానికి వీలుంటుందని ఆయన సూచించారు. అలా సభ్యత్వం తీసుకోని పక్షంలో అది సాధ్యపడదని మురళీమోహన్ తేల్చి చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మురళీమోహన్ మాట్లాడుతూ... ఇటీవల "మా" తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

సభ్యత్వంలేని వారితో తోటీ నటీనటులు సహకరించారని, ప్రధానంగా నటీనటులకున్న మేనేజర్లతో నిర్మాతలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అగ్రిమెంట్లను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నటీనటులకు టి.డి.ఎస్ రిపోర్ట్‌ను, ఐ.టి. రిటర్న్ సమయానికి నిర్మాతలమండలి తప్పనిసరిగా ఇచ్చే ఏర్పాటు చేయాలని మురళీమోహన్ సూచించారు.

నటీనటుల సమగ్రవివరాలను తెలియజేసే వెబ్‌సైట్‌ను జనవరి 26న ప్రారంభించనున్నామని, మా అసోసియేషన్ 15వ వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8న నిర్వహించాలని తీర్మానించామని మురళీ మోహన్ తెలిపారు. మే నెలలో ఆర్టిస్టులతో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.

పరిశ్రమ కోసం కష్టపడాలి: తమ్మారెడ్డి
ఏడాదిలో వారం రోజులపాటు పరిశ్రమ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని తమ్మారెడ్డి అన్నారు. ఇండస్ట్రీ తలపెట్టే పలు కార్యక్రమాలకు నటీనటులు విధిగా హాజరయ్యేలా మా అధ్యక్షుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇన్‌కమ్‌టాక్స్ డబ్బును తిరిగి ఇవ్వమనడంతో వారికి టి.డి.ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, దీనిని మా నియంత్రించాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. కుటుంబంలోని సమస్యలను పరిష్కరించుకున్నట్లే ఇండస్ట్రీలోని సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఆహుతిప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, ఎన్. శంకర్, రాంప్రసాద్, "మా"డైరీ స్పాన్సర్, సుజన గ్రూప్ ఛైర్మన్ వై.ఎస్. చౌదరి, సి. అశ్వనీదత్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M