1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అమీర్ "గజినీ"

వినోదం వెండితెర కథనాలు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ ఖాన్ గజినీ టాలీవుడ్ కోలీవుడ్ అసిన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం "గజినీ" ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సూపర్ హిట్ కొట్టిన 'గజినీ' చిత్రం... హిందీలో రీమేక్ అయి ఈ నెల 25న (క్రిస్మస్) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే ప్రపంచ స్థాయిలో వసూళ్ళ రికార్డు సృష్టించింది. విడుదలకు ముందురోజు 24వ తేదీన దాదాపు 660 ప్రివ్యూ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించడం గమనార్హం.

2000 ప్రింట్లతో ఈ నెల 25వ తేదీన విడుదలైన అమీర్ 'గజినీ' రిలీజ్ అయిన తొలిరోజే 32 కోట్లను వసూలు చేసుకుంది. గతంలో విడుదలైన 'సింగ్ ఈజ్ కింగ్' (14 కోట్లు), 'రాబ్ నీ బాబా ది జోడీ' (11కోట్లు) సినిమాలను వెనక్కు నెట్టి, విడుదలైన రోజే భారీ కలెక్షన్లను 'గజినీ' తన ఖాతాలో వేసుకుంది.

ఈ నేపథ్యంలో... ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న హిందీ 'గజినీ' చిత్రాన్ని చూసేందుకు ఒక్క భాష మాత్రం అంతరాయంగా ఉండకూడదని యూనిట్ భావించింది. ఇందులో భాగంగా.... ఈ చిత్రానికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అదనంగా జోడించి థియేటర్లలో ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. దీంతో హిందీ తెలియని ప్రేక్షకులు కూడా సులభంగా చిత్ర డైలాగ్‌లను అర్థం చేసుకుని తమ చిత్రాన్ని ఆదరిస్తారని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీలోని బిగ్ సినిమాస్, వడాలా మరియు మెట్రో బిగ్ సినిమా థియేటర్లలో అమీర్ హిందీ 'గజినీ'కి, ఆంగ్లపు సబ్‌టైటిల్స్‌ను జతచేసి రెండో వారం నుంచి ప్రదర్శించనున్నట్లు బిగ్ సినిమాస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తుషర్ దింగ్రా వెల్లడించారు.

షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, దక్షిణాది సెక్సీతార అసిన్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి విదితమే. దాదాపు 22 దేశాల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోందని సినిమా యూనిట్ పేర్కొంది.
About Writer
SELVI.M