మతం కంటే మానవత్వం గొప్పదనే "అమృత"
|
భానుప్రియ, భానుచందర్, బేబీ గాయత్రి, కీర్తి ప్రధాన తారాగణంగా.. ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ గౌని నిర్మిస్తున్న చిత్రం "మై నేమ్ ఈజ్ అమృత". ఆంథోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి రచయిత మురళి బోడపాటి మాట్లాడుతూ... సమాజంలోని ఓ ప్రధాన సమస్య చుట్టూ కథ తిరుగుతుందన్నారు.
మనుష్యుల్లో అణగారిపోతున్న మానవతా విలువలను కాపాడడానికి ఓ చిన్నారి చేసే ప్రయత్నమే ఈ చిత్రమని బోడపాటి చెప్పారు. మతం కంటే మానవత్వం గొప్పదని చాటే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తీస్తున్నామని ఆయన వివరించారు.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సందేశాత్మక చిత్రంగా "మై నేమ్ ఈజ్ అమృత" తెరకెక్కనుందని నిర్మాత వెల్లడించారు. జనవరి మొదటివారంలో ఆడియోను, మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి మాటలు... రవీంద్ర సూరి, పాటలు... సూరిశెట్టి రామారావు, ఎడిటింగ్.. గౌతంరాజు, కెమేరా.. తోట వెంకటరమణ.