"ఆకాశరామన్న" ఎవరో..!

అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరా జాస్మిన్, గౌరి పండిట్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఆకాశరామన్న". అశోక్ దర్శకత్వంలో మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో జరిగింది. చిత్ర టైటిల్ లోగోను హ్యాపీడేస్ ఫేం వరుణ్ సందేశ్ ఆవిష్కరించారు. ఈ సినిమా గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "గమ్యం" తర్వాత స్క్రిప్ట్ నచ్చిన చిత్రమిదన్నారు. ఇందులో శివాజీ, తాను హీరోలైనా.. కలిసి నటించే సన్నివేశాలు ఇంతవరకు రాలేదని, ఎక్కువభాగం షూటింగ్ రాత్రిపూట జరుగుతోందని చెప్పారు. అయితే ఇది థ్రిల్లర్ మూవీ కాదని, కామెడీతో కూడిన సస్పెన్స్ ఉంటుందని వెల్లడించారు. ఇందులో.. "ఆకాశరామన్న" ఎవరన్నదే ట్విస్ట్ అని నరేష్ చెప్పారు. కాలేజీ చదివే రోజుల్లో ఎలా ప్రవర్తించానో... అలాంటి పాత్రే ఇందులో పోషిస్తున్నానని శివాజీ అన్నారు. స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రాజీవ్ కనకాల చెప్పారు. నిర్మాత మన్యం రమేష్ మాట్లాడుతూ.. "హీరో" సినిమా నిరాశను మిగిల్చిన తరుణంలో అశోక్ మంచి స్క్రిప్ట్ వినిపించాడని చెప్పారు, హీరోలందరూ బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చి డేట్స్ సర్దుకుని నటించేందుకు అంగీకరించారని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమాకు మంచి టైటిల్ కోసం ఇ.వి.విని సంప్రదించానని, కథ డెప్త్ నచ్చి, స్క్రిప్ట్‌కు యాప్ట్‌గా ఉంటుందని ఆయన రిజిస్టర్ చేయించుకున్న "ఆకాశరామన్న" టైటిల్ తనకిచ్చారని నిర్మాత వివరించారు. జనవరి 10వ తేదీతో టాకీ పూర్తవుతుందని, ఫిబ్రవరిలో నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. తన పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించానని రావు రమేష్ అన్నారు.నాగబాబు, వేణుమాధవ్, "సత్యం" రాజేష్, శ్రీనివాసరెడ్డి, టార్జాన్, రఘు, గీతాసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... చక్రి, కెమేరా.. శ్రీరామ్, ఎడిటింగ్.. ప్రవీణ్ కుమార్, డైలాగ్స్.. చంద్రశేఖర్, యాక్షన్... గణేష్, ఆర్ట్.. మణి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... అశోక్. సంబంధిత సమాచారం కోసం శోధించండి.