1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలీవుడ్‌కే పరిమితం కాను: శశిరేఖ

వినోదం వెండితెర కథనాలు బాలీవుడ్ టాలీవుడ్ కార్తికేయ క్రియేషన్స్ జెనీలియా శశిరేఖా పరిణయం బాయ్స్ సత్యం ఇట్స్ మై లైఫ్
తాను బాలీవుడ్‌కే పరిమితం కాదని, టాలీవుడ్ చిత్రాలు కూడా చేస్తూనే ఉన్నానని నటి జెనీలియా పేర్కొంది. ఇప్పటికే.. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించానని, అయితే తనకు గుర్తింపు సంపాదించి పెట్టింది... టాలీవుడేనని జెనీలియా తెలిపింది. "శశిరేఖా పరిణయం" చిత్ర కథను వినడానికి ఆరునెలల కాలం పట్టిందని, అప్పటికి బాలీవుడ్‌లో బిజీగా ఉన్నానని ఆమె చెప్పింది.

శశిరేఖా పరిణయం చిత్రం ప్రమోషన్‌లో భాగంగా... కార్తికేయ క్రియేషన్స్ యూనిట్ శనివారం శబ్దాలయలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జెనీలియా పలు విషయాలను వెల్లడించింది.

ఇంతగా ఎదుగుతానని అనుకోలేదు...
సినీ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టి ఆరు సంవత్సరాలైందని... ఇంత స్థాయికి ఎదుగుతానని అనుకోలేదని జెనీలియా తెలిపింది. "తేఝో మేరికసమ్" చేసినప్పుడే ఇదే ఆఖరు సినిమా అనుకున్నానని, అయితే ఆ తర్వాత "బాయ్స్", "సత్యం" ఇలా ప్రతి చిత్రానికిదే చివరి సినిమా అనుకున్నానని జెనీలియా చెప్పింది. కానీ తనను టాలీవుడ్, బాలీవుడ్ ఆదరించిందని ఆమె గుర్తుచేసుకుంది.

చదువును కొనసాగించా...
తాను బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నప్పుడే సినిమా అవకాశాలు వెల్లువల్లా వచ్చేవని, అయినా చదువుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నానని జెనీలియా చెప్పింది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి చదువుకునే దానినని, 7 గంటల నుంచి 2 వరకు కాలేజీలో ఉండేదానినని, ఆ తర్వాతే షూటింగ్‌లో పాల్గొనేదానినని ఆమె తెలిపింది. ఇలా మేనేజ్‌మెంట్ కోర్సు ద్వారా పద్ధతిని అలవాటు చేసుకున్నానని, అదే సినీ కెరీర్‌కు ఎంతగానో తోడ్పడిందని జెనీలియా వెల్లడించింది.

మొటిమలు కవర్ చేయాలంటే మేకప్ తప్పదుగా...
తాను ఓవర్ మేకప్ చేసుకుంటున్నానని చాలామంది అన్నారని, కమర్షియల్ చిత్రాలకు మేకప్‌తోనే చేయాలంటారని జెనీలియా తెలిపింది. తనకు మొటిమలు ఎక్కువని, వాటిని కవర్ చేయాలంటే మేకప్ తప్పదని జెనీలియా చెప్పింది.

రెండు పాత్రలు చేయడం అదృష్టం..
బొమ్మరిల్లులో అమాయకత్వంతో కూడిన హాసిని పాత్రను, శశిరేఖా పరిణయంలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే బుజ్జమ్మ పాత్రను చేయడం అదృష్టంగా భావిస్తున్నానని హాసిని తెలిపింది. బుజ్జమ్మ పాత్ర తనకు బాగా నచ్చిందని, ఆ పాత్రను చక్కగా తెరకెక్కించేందుకు దర్శకుడు కృష్ణవంశీ చాలా కష్టపడ్డారని జెనీలియా వెల్లడించింది. బుజ్జమ్మ పాత్రను చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అటువంటి పాత్రలు తనకే దక్కడం గర్వంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

తాగుబోతు పాత్ర చాలా ఇష్టం..
నిజజీవితంలో తాను తాగనని, శశిరేఖాపరిణయంలో తాగుబోతులా నటించానని, ఆ పాత్ర తనకు నచ్చిందని జెనీలియా చెప్పింది. ఆ పాత్రలో తాను చక్కగా ఇమిడేందుకు దర్శకుడు కృష్ణవంశీ కారకుడని ఆమె వెల్లడించింది.

బయట అంతా ఆయనను ఇగోయిస్ట్‌గా భావిస్తారని, తాను మొదటిసారి వంశీ చిత్రంలో నటించినా... సినిమాపై కృష్ణవంశీకున్న శ్రద్ధను కళ్లారా చూశానని జెనీలియా తెలిపింది. పాత్రలను ఎలా మలుచుకోవాలని, ఇంకా ఎంత చక్కగా నటించాలనే అంశాలను ఆయన దగ్గర నేర్చుకున్నానని వెల్లడించింది.

నిజజీవితంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే మనస్తత్వం గలదానినని, ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని జెనీలియా తెలిపింది. "బొమ్మరిల్లు" హిందీలో "ఇట్స్ మై లైఫ్" పేరుతో నిర్మిస్తున్నారని ఆమె చెప్పింది. తెలుగులో రెండు చిత్రాలు కమిట్ అయ్యానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని శశిరేఖ పేర్కొంది.
About Writer
SELVI.M