ఎన్కౌంటర్ చేస్తేనే నేరస్థులు తగ్గుతారని, వారిలో భయం పుడుతుందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని నటుడు జగపతి బాబు అన్నారు. అందుకే అటువంటి ఎన్‌కౌంటర్ పాత్రను "సిద్ధం" చిత్రంలో పోషించానని ఆయన చెప్పారు. ఇటువంటి పాత్రను ఎప్పటి నుంచో చేయాలనుకున్నానని జగపతిబాబు వెల్లడించారు.
విధి నిర్వహణలో జాతీయస్థాయి అవార్డు పొందిన ఎస్.ఐ దయానాయక్ ప్రేరణగా తీసుకుని "సిద్ధం" అనే చిత్రం రూపొందింది. ఇందులో జగపతిబాబు దయానాయక్‌గా నటించారు. సింధుమీనన్ హీరోయిన్‌గా నటించింది. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. జె.డి.చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఇందులో నటించానని, దయానాయక్‌తో పాటు సురేంద్రబాబు, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు వంటి వారు కూడా ఈ చిత్రానికి ఇన్‌స్పిరేషన్ అని జగపతిబాబు వెల్లడించారు. అమర్ మెహిలి సంగీతం ఈ చిత్రానికి అద్భుతంగా అమరిందని ఆయన తెలిపారు.
జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ... జగపతిబాబు పాత్ర పేరు దయ అని, ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అందించారని తెలియజేశారు. ముందుగా దయానాయక్‌తో చర్చించామని చెప్పారు. ఆయన తమతో... చావడం కన్నా చంపడమే చాలా కష్టమన్నారని, దయానాయక్... ప్రతిరోజూ దేవుడిని పూజిస్తూ... "ఈ రోజు ఎవర్నీ చంపకూడదనుకునే వారట" అని జె.డి వెల్లడించారు. కానీ పరిస్థితులు వేరుగా ఉండేవని, చావడానికైనా, చంపడానికైనా "సిద్ధం" అని పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారని, ఇదే తమ చిత్ర కథ కూడా అని చక్రవర్తి వివరించారు.
నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "హోమం" తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించానని, తనకు చక్కని టీమ్ లభించిందని, అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కిరణ్ కుమార్ వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో రాధారవి, ముఖుల్‌దేవ్, కోటశ్రీనివాసరావు, శివప్రసాద్, నర్సింగ్ యాదవ్, అపర్ణ, బేబి శివాని, భరత్ తదితరులు నటించారు. కెమేరా.. భరణి. కె. ధరణ్, ఎడిటింగ్... భనోదయ, యాక్షన్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. జె.డి.చక్రవర్తి.