"త్యాగయ్య" చిత్రం ప్రారంభం
|
అనంతరం రమణమూర్తి మాట్లాడుతూ... మన సంగీత ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చేరువ చేయాలనే ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నానన్నారు. తాను అడుగగానే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం చేయడానికి అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు.
ఇందులో త్యాగయ్య సంకీర్తనలు చేసే ఈశ్వరప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారని, ఆయన సహధర్మ చారిణిగా చిద్రూపి త్యాగయ్య సతీమణిగా నటిస్తున్నారని రమణమూర్తి వివరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
రోశయ్య మాట్లాడుతూ... గతంలో రెండుసార్లు త్యాగయ్య సినిమాలు తీశారన్నారు. రమణమూర్తి చేస్తున్న ఈ సాహసప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షించారు.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం భక్తి సినిమాలను ఆదరిస్తున్నారనేదానికి అన్నమయ్య, భక్తరామదాసు, వంటి చిత్రాలే నిదర్శనాలన్నారు. ఈ సినిమా తీయడం ధైర్యంతో చేసే వ్యాపకమని, సంగీతం శ్రీనివాసరావు కాబట్టి, ఈ చిత్రం బాగా వస్తుందనే నమ్మకముందని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడమనేది మహాయజ్ఞమని, రమణమూర్తి వచ్చి ఈ సినిమా చేద్దామని చెప్పగానే తప్పకుండా చేద్దామని అంగీకరించానని వెల్లడించారు. దీనికి సంగీతం ఇళయరాజానే చేయగలడని, అడిగిన వెంటనే ఆయన కూడా ఒప్పుకోవడం హర్షనీయమని దర్శకుడు చెప్పారు.
అంతా సిద్ధమయ్యాక గతంలో చిత్తూరు నాగయ్య, బాపు వంటివారు తీసిన సినిమాను తాను తీయగలనా? అనే భయం కలిగిందని, ఆ కాలంలో వారు దానికోసం పరిశోధించి ఎన్నో అంశాలను కనుగొన్నారని దర్శకుడు అన్నారు. ఇప్పుడు కష్టపడకుండా కంప్యూటర్లలో అన్నీ నిక్షిప్తమై ఉన్నాయని గుర్తుచేశారు.
ప్రపంచంలో ఎన్నో దేశాల్లో త్యాగయ్య సంకీర్తన జరిగిందని, త్యాగయ్య, శ్యాస్వామి, ముత్తుస్వామి అనే ముగ్గురు సంగీతంలో త్రిమూర్తులని వెల్లడించారు. 50 సంవత్సరాలుగా తాను సినిమా పరిశ్రమలో ఉన్నానని, ఈ కాలంలో తాను తెలుసుకుందల్లా.. అన్ని సెంటిమెంట్స్‌లోనూ స్నేహం గొప్పదన్నదేనని తెలిపారు. ఆ దిశగా ఈ చిత్రాన్ని చక్కగా తీర్తిదిద్దుతాననే నమ్మకముందని చెప్పారు.
రచయిత జె.కె. భారవి మాట్లాడుతూ... అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య ఈ ముగ్గురూ జాతి రత్నాలని, ఈ ముగ్గురి సినిమాలకు పనిచేయడం అదృష్టమని, ఇన్ని భక్తి చిత్రాలకు పనిచేసినా వృత్తిపరమైన తృప్తిలేదని, సింగీతం వద్ద పనిచేస్తుంటే ఆ తృప్తి కలుగుతోందన్నారు. వయస్సు పెద్దదయిన సింగీతం మనస్సు యువకుల మాదిరిగానే ఉంటుందని చెప్పారు. మంచి స్నేహానికి విలువనిచ్చే కథే ఈ చిత్రమని తెలిపారు.
త్యాగయ్య పాత్రధారి ఈశ్వరప్రసాద్ మాట్లాడుతూ.. త్యాగయ్య పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని , ఇంట్లో తన సతీమణితో కలిసి ఎప్పుడూ సంకీర్తన చేస్తూనే ఉంటామని చెప్పారు. అలాంటి తాము త్యాగయ్య సినిమాలో భార్యాభర్తలుగా నటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.