1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కోలీవుడ్‌లో "శర్వానంద్" విజయ బావుటా..!

వినోదం వెండితెర కథనాలు కోలీవుడ్ శర్వానంద్ విజయ బావుటా గమ్యం కమలిని ముఖర్జీ రాజుమహారాజు మోహన్బాబు రమ్యకృష్ణ
WD
"గమ్యం" హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శర్వానంద్ "కాదలన్నా సుమ్మా ఇల్లై" చిత్రం ద్వారా కోలీవుడ్‌లో కూడా సక్సెస్ సాధించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం విజయాన్ని కైవసం చేసుకుందనే వార్త తెలుగు పరిశ్రమకు కూడా ఆనందం కలిగించింది.

ప్రతి సంవత్సరం సంక్రాంతికి తెలుగులో లాగానే తమిళంలో కూడా భారీ చిత్రాలు విడుదలయ్యే ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ చిత్రాలతో పాటు... 2008లో తెలుగులో ఘనవిజయం సాధించిన "గమ్యం" చిత్రం తమిళ్ రీమేక్ అయిన "కాదలన్నా సుమ్మా ఇల్లై"లు విడుదలయ్యాయి.

యువకథానాయకుడు శర్వానంద్ హీరోగా, కమలిని ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రాజ్ టీవీ సంస్థ నిర్మించింది. సహజంగా.. ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలోకి డబ్బింగ్ చేస్తుండడం రివాజు. దానికి భిన్నంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు తమిళంలోకి ఎంతో ఇష్టంగా పునర్నిర్మించగా, వారి కష్టం సక్సెస్ ద్వారా మంచి ఫలితాన్ని అందించిందని చెప్పొచ్చు.

ఈ చిత్రం సంక్రాంతి పర్వదిన సందర్భంగా విడుదలై కోలీవుడ్ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది. తమిళనాడు ట్రేడ్ రిపోర్టింగ్ ప్రకారం ఈ సినిమా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో శర్వానంద్ చెన్నై యూత్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. చాలామంది నిర్మాతలు శర్వానంద్ కాల్‌షీట్ల కోసం క్యూ కడుతున్నారంటే ఈ చిత్రం ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. భారీ చిత్రాల నడుమ ఒక తెలుగు అబ్బాయి హీరోగా నటించిన చిత్రం అపూర్వ విజయం సాధించి రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తుండటం విశేషం.

కళకు భాషాబేధాలు లేవని, రాష్ట్రాల, ప్రాంతాల సరిహద్దులు అసలుండవని ఈ సినిమా నిరూపించింది. తెలుగులో చిన్న చిత్రాల్లో పెద్ద చిత్రంగా ఘనవిజయాన్ని చవిచూసిన ఈ చిత్రం తమిళనాట కూడా ప్రేక్షకుల ఆదరణ నోచుకుని, విజయకేతనం ఎగురవేయడం తెలుగు "వాడి"కి తార్కాణం.

ప్రతిభ ఎక్కడున్నా ప్రశంసాపాత్రమని తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా మరోసారి నిరూపించారు. ఓ కొత్త హీరోతోపాటు సరికొత్త కథాకథనాలతో అలరించిన ఈ సినిమా తర్వాత శర్వానంద్‌కి అక్కడి పరిశ్రమ ప్రముఖుల నుంచి అందుతున్న అభినందనలు కోకొల్లలు. ఈ సినిమాలో శర్వానంద్ పరిణతి గల నటనను ప్రదర్శించాడంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.

చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదుగుతూ పలు అగ్రగామి సంస్థల్లో, అగ్రకథానాయకులతో కలిసి నటిస్తున్నారు శర్వానంద్. త్వరలో డాక్టర్ మోహన్‌బాబు, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న "రాజు-మహారాజు" తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పట్ల ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. శర్వానంద్ మరిన్ని సక్సెస్‌లు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
About Writer
SELVI.M