"టాలీ టు హాలీ" అనే నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న నూతన చిత్రం షూటింగ్ 80శాతం పూర్తయింది. పేరు పెట్టని ఈ చిత్రంలో అజయ్, సురేష్ గోపి నటిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాలను సురేష్ గోపి తెలియజేస్తూ.. తెలుగు ఇండస్ట్రీని ఎప్పటికీ మర్చిపోనని, 20 ఏళ్ల తర్వాత స్ట్రెయిట్‌గా తెలుగు సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. మలయాళంలో హిట్టయిన "న్యూఢిల్లీ టైమ్స్" చిత్రాన్ని "అంతిమ తీర్పు"గా చేశారు. అందులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషించారు. ఆయన నుంచి ఎన్నో విలువలను నేర్చుకున్నానని సురేష్ గోపి చెప్పుకొచ్చారు.
మలయాళంలో సీనియర్ నటుడు నాజర్ కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని గోపి వెల్లడించారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మంచి కథాబలంతో థ్రిల్లర్‌తో తెరకెక్కనుందని, తప్పకుండా విజయవంతమవుతుందని సురేష్ గోపి ఆశాభావం వ్యక్తం చేశారు.
హాస్యనటుడు సునీల్ మాట్లాడుతూ.. థ్రిల్లర్ చిత్రాలంటే లాంగ్‌లైఫ్ ఉండవని గతంలో అనేవారు. కానీ ఆ చిత్రాల్లోనే కథాబలముంటుందని చెప్పారు. తాజాగా టాలీ అండ్ హాలీ ఫిలిమ్స్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర సీరియస్‌గా ఉంటుందని, కానీ ప్రేక్షకులను నవ్విస్తానని సునీల్ వెల్లడించారు.
చిత్ర సహ నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. ఓవర్‌సీస్‌లో "అందాలరాముడు" చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించామని, పలు విజయవంతమైన చిత్రాలను చేశామని తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థగా ఏర్పడి పలు తెలుగు సినిమాలను నిర్మించాలని నిర్మాణరంగంలో ప్రవేశించామని వివరించారు.
తొలిసారిగా మంచి కథాబలమున్న చిత్రాన్ని నిర్మిస్తున్నామని, జాతీయ స్థాయి నటులు ఈ చిత్రంలో నటించడం తమ బేనర్‌కు వన్నెతెస్తుందని సుధాకర్ చాగంటి చెప్పారు.
అజయ్ మాట్లాడుతూ.. తొలిసారిగా ప్రారంభించిన కార్పొరేట్ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో ఆరు పాటలు కీలకమైనవని, ఇందులో ఎవరు విలన్? అనేది చివరి వరకు తెలియదని, చాలా సస్పెన్స్‌గా దర్శకుడు రామ్మూర్తి స్క్రీన్‌ప్లే చేశారని వెల్లడించారు.
రచయిత సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ.. సంభాషణలపరంగా ఆకట్టుకునే చిత్రమవుతుందని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో మధురిమ, విజయ్ చందర్, ఎం.ఎస్. నారాయణ, రఘుబాబు, ధర్మవరపు, అవినాష్, ప్రభు, బాలయ్య, మాస్టర్ భరత్, జెన్నీ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం.. మణిశర్మ, కెమేరా.. కమలాకర్, ఆర్ట్.. డి.వై. సత్యనారాయణ, ఫైట్స్.. గణేష్, నిర్మాత.. ఇందుకూరి గణపతిరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎన్.ఎస్. మూర్తి.