1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నయన"పై నిషేధానికి చెల్లుచీటి..!

వినోదం వెండితెర కథనాలు నయన నిషేధం తొలగింపు చెల్లుచీటి టాలీవుడ్ కోలీవుడ్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి
హమ్మయ్య..! నయనపై నిషేధం తొలగిపోయిందట. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తూ అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న నయనతారపై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి విధించిన బహిష్కరణ వేటును తొలగించింది.

"పయ్యా" అనే తమిళ చిత్రంలో నటించేందుకు తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి చెల్లించని కారణంగా నిర్మాత లింగుస్వామి హీరోయిన్ నయనతారపై తమిళ చలన చిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన నిర్మాతల మండలి నయనపై తమిళ చిత్రాల్లో నటించడాన్ని నిషేధించింది.

అనంతరం జరిగిన చర్చల్లో తన నిర్ణయాన్ని మార్చుకుని, నయనతారపై నిషేధాన్ని తొలగిస్తున్నామని తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

పరుత్తివీరన్ ఫేమ్ కార్తీ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో రూపొందించనున్న "పయ్యా" అనే కోలీవుడ్ చిత్రంలో మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నారు.

నయనతారకు కోటి రూపాయలు పారితోషికం చెల్లించేందుకు నిర్మాత అంగీకరించి, ఆమెకు 25లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా తీయలేకపోతున్నానని, తానిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా నిర్మాత నయనతారను కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో నిర్మాత ఆగ్రహించి సినీ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

నిర్మాత ఫిర్యాదును పరిశీలించిన తమిళ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ మరియు సౌత్‌ ఇండియా ఫిల్మ్ యాక్టర్స్ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్మాతను ఇబ్బంది పెట్టిన నయనతారను ఇటీవలే బహిష్కరించింది. అయితే ఈ సినిమా కోసం నిర్మాతకు డేట్స్ ఇచ్చి తాను నష్టపోయాయనని నయనతార వాదించింది.

ఇంకేముంది.. మొత్తానికి నయనపై నిషేధం తొలగిపోయింది. ఇక అమ్మడు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చన్నమాట..!
About Writer
SELVI.M