సత్యం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, జల్సా తదితర చిత్రాల్లో నటించిన వెంకీ ఫోట్రియా స్టూడియోను స్థాపించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని గణేష్ కాంప్లెక్స్ సమీపాన ఈ స్టూడియోను నటులు వేణుమాధవ్, ఉత్తేజ్‌తో పాటు పలువురు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. జె.ఎన్.టి.యులో బి.ఎఫ్.ఎ (ఫోటోగ్రఫీ)లో గోల్డ్‌మెడలిస్టునని, సినిమారంగంలో చాలామందికి పోర్ట్‌పోలియోస్ తీశానని చెప్పారు. పలు ఫ్యాషన్ షోస్‌ను నిర్వహించానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని రెండు ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కు ఫోటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. వృత్తిరీత్యా ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల్లో పర్యటించానని, కానీ హైదరాబాద్‌లోనే ఫోటోగ్రఫీ వెనుకంజలో ఉందని, అందుకే ఈ ప్రాంతంలో స్టూడియోను ప్రారంభించానని వివరించారు.
అధునాతన పరికరాతలో, అధునాతన సౌకర్యాలతో అందుబాటు ధరలతో పనిచేయడం తమ స్టూడియో ప్రత్యేకత అని వెంకీ చెప్పుకొచ్చారు. విశాలమైన రూమ్స్, పార్కింగ్ సౌకర్యం, వెయిటింగ్‌హాల్, రెసెప్షన్‌హాల్‌తో పాటు లేటెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
ఉత్తేజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి దగ్గరగా ఫ్యాషన్ స్టూడియో నెలకొల్పడం సంతోషకరమని చెప్పారు. వేణుమాధవ్ వ్యాఖ్యానిస్తూ.. వెంకీ కాన్సెప్ట్ చాలా నచ్చిందని, స్టూడియోకురాగానే.. చెడువినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు.. పక్కనే చెడు ఫోటోలు తీయకు.. అనేది పెట్టాడు. ఆయన నైజం ఏమిటో ఈ చిత్రాల ద్వారా తెలుస్తోందని కొనియాడారు. అంచెలంచెలుగా ఈ స్టూడియో ఎదగాలని ఉత్తేజ్ ఆశించారు.
మరో నటుడు వేణు మాట్లాడుతూ... వెంకీ ఐదేళ్ల కల నేడు నెరవేరిందని, జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకోవాలని అభిలాషించారు.