1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శోభ భేషరతు క్షమాపణకు "మా" డిమాండ్

శోభా నాగిరెడ్డి రోజా సినిమా చిత్ర పరిశ్రమ చిరంజీవి నాగబాబు
ప్రజారాజ్యం మహిళా నేత శోభా నాగిరెడ్డి సినీ పరిశ్రమను కించపరిచే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీర్మానించింది. జూబ్లిహిల్స్‌లోని కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైన సభ్యులు శోభానాగిరెడ్డి, రోజాల వ్యాఖ్యలపై చర్చించారు.

సమావేశంలో మురళీ మోహన్ మాట్లాడుతూ... న్యాయవాది అయిన శోభా నాగిరెడ్డి గతంలో సెన్సార్ సభ్యులుగా కూడా ఉన్నారనీ, అటువంటివారు ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. అయితే పీఆర్పీ నేత నాగబాబు ఫోనులో స్పందిస్తూ... ప్రజారాజ్యం ఎవరినీ వ్యక్తిగతంగా దూషించదనీ, ఎదుటివారే తమను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా విమర్శించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు.

నాగబాబు స్పందన అసంతృప్తికరంగా ఉందని సినీనటి జయసుధ విమర్శించారు. శోభ వ్యాఖ్యలను ఖండించకపోగా... ఆమెను వెనకేసుకు రావడం మంచి పద్ధతికాదని హితవు పలికారు. జీవిత రాజశేఖర్ అందుకుంటూ... తమపై గతంలో చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేసినప్పటికీ తాము వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. అయితే పవన్ కల్యాణ్ ఇటీవల కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పంచెలు ఊడేదాగా తరమండి అని దుర్భాషలాడారని గుర్తు చేశారు.

ప్రముఖ దర్శకుడు దాసరి మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని వాపోయారు. రాజకీయాలలోకి వెళ్లిన సినీ ప్రముఖులు సినీరంగాన్ని దూషించడం సరైన పద్ధతి కాదనీ, ఈ పద్ధతికి తక్షణం స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

శోభానాగిరెడ్డి చేత చిరంజీవే స్వయంగా క్షమాపణ చెప్పించాలని సభ్యులందరూ డిమాండ్ చేశారు. కాగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సినీ నటి రోజా ప్రకటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT