1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"అల్లు అర్జున్‌"తో గుణశేఖర్ కొత్త చిత్రం!

వినోదం వెండితెర కథనాలు అల్లు అర్జున్ గుణశేఖర్ కొత్త చిత్రం ఆర్య విలన్ యూనివర్శల్ మీడియా డివివి దానయ్య
WD
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్‌ల సూపర్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో అల్లు అర్జున్‌పై ఇంట్రడక్షన్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన సెట్స్‌లో, ప్రేమ్‌రక్షిత్ నృత్యదర్శకత్వంలో భారీ ఎత్తున చిత్రీకరిస్తారు.

విలన్‌గా తమిళ స్టార్ హీరో ఆర్య!
బాల దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం "నాన్ కడవుల్" (తెలుగులో నేను దేవుణ్ణి)తో స్టార్ హీరోగా ఎదిగిన ఆర్య ప్రస్తుతం 'బిల్లా' దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో "పర్వం" అనే భారీ క్రేజీ చిత్రంలోనూ, మదరాసు పట్టణం అనే మరో కాస్ట్‌లీ ఫిలిమ్‌లోనూ, ఇంకో రెండు బిగ్ ప్రాజెక్టుల్లోనూ హీరోగా నటిస్తున్నారు.

అనేక సినిమాలతో ఆర్య బిజీబిజీగా ఉన్నప్పటికీ గుణశేఖర్ చెప్పిన కథ విని బాగా ఇన్‌స్పైర్ అయి, ఎలాగైనా గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేయాలన్న ఆసక్తితో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్యారెక్టర్‌ని మిస్ చేయకూడదన్న అభిప్రాయంతో విలన్‌గా నటించడానికి కమిట్ అవడం విశేషం. ఈ విలన్ పాత్రకు డేట్స్ ఇవ్వడానికి తాను హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రాల దర్శక నిర్మాతల్ని రిక్వెస్ట్ చేసుకుని మరీ డేట్స్ తీసుకుని మరీ ఇవ్వడం గమనార్హం.

నువ్వా.. నేనా అని పోటీపడే క్యారెక్టర్స్..!
నిర్మాత డి.వి.దానయ్య ఈ చిత్రం గురించి చెబుతూ.. అల్లు అర్జున్‌కి ఉన్న యూత్, మాస్ ఇమేజ్ మిస్ అవకుండా ఓ కొత్త డైమెన్షన్‌లో గుణశేఖర్ హీరో పాత్రను క్రియేట్ చేశారన్నారు. అర్జున్ కెరీర్‌లో బన్నీ సెన్సేషనల్ ఫిలిమ్ అవుతుందని, అలాగే ఇందులో విలన్‌ది చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని నిర్మాత వివరించారు.

విలన్ క్యారెక్టర్‌కు చాలామందిని అనుకున్నామని, ఎవ్వరూ ఆ క్యారెక్టర్‌కి సూట్ అవరని తమిళ హీరో ఆర్యను అడిగామని, కథ వినగానే విలన్ క్యారెక్టర్ చేయడానికి ఆర్య అంగీకరించారని దానయ్య చెప్పారు. ఇందులో అర్జున్, ఆర్యల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటాయని, ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నామని, రెండు నెలలుగా ఈ హీరోయిన్‌కు ట్రైనింగ్ ఇస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

ఈ నెల నుంచి ప్రారంభం కానున్న రెగ్యులర్ షూటింగ్‌ను ఏకధాటిగా కొనసాగించి ఆగస్టు నెలకల్లా చిత్రాన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. హీరోగా బన్నికి, దర్శకులుగా గుణశేఖర్‌కు, నిర్మాతగా తనకు ఈ చిత్రం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని దానయ్య చెప్పారు.

ఇంకా ఈ సినిమాకు సంగీతం.. మణిశర్మ, పాటలు.. వేటూరి, ఫోటోగ్రఫీ.. ఆర్.డి.రాజశేఖర్, ఆర్ట్.. అశోక్, ఫైట్స్... స్టంట్ శివ, ఎడిటింగ్.. శ్రీకర్ ప్రసాద్.
About Writer
SELVI.M