సినీతారల నడుమ ఆంధ్రా ఎంజీఆర్ అంతిమయాత్ర
|
ఆదివారం రాత్రి 10.30 గంటల తర్వాత ఆయన భౌతికకాయాన్ని యశోదా ఆసుపత్రి నుంచి చినల్ల కుంటలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఉదయం సంప్రదాయంగా అన్నీ కార్యక్రమాలు ముగిశాక, ఆయన భౌతికకాయాన్ని ఇండస్ట్రీ సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్ కార్యాలయం ఆవరణకు తరలించారు.
జూబ్లీహిల్స్‌లో ఉంచిన కాంతారావు భౌతికకాయాన్ని దాసరి నారాయణరావు, మోహన్ బాబు, చిరంజీవి, నాగబాబు, మురళీమోహన్, బాలకృష్ణ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తమ్మారెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణ, కైకాల సత్యనారాయణ, గీతాంజలి, నన్నపనేని రాజకుమారి, సుబ్బరామిరెడ్డి, జీవిత తదితరులు సందర్శించారు.
సినీ ప్రముఖులంతా కాంతారావు భౌతికకాయానికి పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు కాంతారావు భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వద్దకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు కాంతారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తమది 50 సంవత్సరాల అనుబంధమని, చాలా చిత్రాలకు కలిసి పనిచేశామని కైకాల సత్యనారాయణ అన్నారు. ఆయనో గొప్పనటుడని, కాంతారావును ఆంధ్రా ఎంజీఆర్ అని పిలుస్తుండే వాళ్లమని చెప్పారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, కాంతారావు మరణ వార్త తననెంతో కలచివేసిందని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సహచరనటీనటులందరూ కాంతారావు తమకున్న పరిచయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తనకు 57 ఏళ్ల అనుబంధముందని సి. నారాయణరెడ్డి అన్నారు. జానపద, పౌరాణిక వేషాలు వేయాలంటే, ఎన్టీఆర్ తర్వాత కాంతారావే సమర్థుడని, మంచి ఉచ్ఛారణ, అంకితభావంతో పనిచేసిన నటుడని నారాయణ రెడ్డి కొనియాడారు. అంతా సజావుగా ఉన్న తరుణంలో సినిమా నిర్మాణం చేపట్టి ఆర్థికంగా దెబ్బతిని ఇంటిని కూడా పోగొట్టుకుని, దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని నారాయణ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తనకిష్టమైన నటుడు కాంతారావు అని మోహన్ బాబు అన్నారు. తాను అసిస్టెంట్ డైరక్టెర్‌గా ఉన్నప్పుడే కాంతారావును బాగా తెలుసునని, ఫోక్‌లోర్ హీరో అంటే ఆయనేనని చెప్పారు.
1964 నటునిగా ఆయనతో కలిసి నటించానని దాసరి చెప్పారు. తన దర్శకత్వంలోనే 28 సినిమాల్లో పనిచేశారన్నారు. ఆయన లోటు సినీ ప్రపంచానికి తీరని లోటని దర్శకరత్న అన్నారు.
రాముడు భీముడు సినిమా తర్వాత కాంతారావుతో "ప్రతిజ్ఞా పాలన" తీశానని రామానాయుడు అన్నారు. ఈ సినిమా చాలా బాగా ఆడిందని, హీరోగా చాలా చిత్రాల్లో చేసినా, వేరే హీరో నటించే చిత్రంలో చిన్న వేషం దొరికినా వేసేవాడని, కాంతారావును తన కుటుంబంలో ఒకడిగా నడిపే వాడినని రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
నాన్నగారితో పలు సినిమాల్లో కలిసి నటించారని, కాంతారావు మహానటుడని బాలకృష్ణ అన్నారు. నాన్నగారు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగే వారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని బాలయ్య చెప్పారు. ఈ సందర్భంగా కాంతారావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు.
జానపద పౌరాణికాల హీరోనే కాగా, నారదునిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారని, చివరి రోజుల్లో కాంతారావు ఆర్థికంగా దెబ్బతినడం చాలా బాధేసిందని, ఈ మధ్యనే ఆయన్ను చూసేందుకు వెళ్ళి పలకరించి వచ్చానని తమ్మారెడ్డి కృష్ణమూర్తి అన్నారు.
ఎన్టీఆర్ సొంత సోదరునిగా కాంతారావును చూసేవారని, తమ పెళ్లికి కూడా ఆయన వచ్చేవారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. మహానటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయన, చివరి దశలో చిన్న చిన్న పాత్రలు వేసి కుటుంబాన్ని పోషించడం ఎన్టీఆర్‌ను కలచివేసిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను పలకరించేందుకు వచ్చిన కాంతారావుకు తగిన సాయం చేశారని ఆమె చెప్పారు.
పలు సంఘాలు సంతాపం
ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి కాంతారావు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుగా అధ్యక్షుడు బాబ్జీ, కోశాధికారి అల్లంగోపాలరావు, ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, డైరక్టర్స్ అసోసియేషన్, నిర్మాతల మండలి, తదితర ఫెడరేషన్ సంఘాలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.