Mallanna Trailers released | "మల్లన్న" ట్రైలర్స్ విడుదల
|
ఈ సినిమా గురించి దర్శకుడు వివరాలు తెలియజేస్తూ.. మల్లన్న సూపర్‌హీరోగా పిలవబడతాడని చెప్పారు. దేశంలో పేదవారు మరీ పేదవారుగా, రిచ్ పీపుల్ మరీ రిచ్‌గా ఎదుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటనే అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని దర్శకుడు తెలిపారు. తాను తీసే సినిమాల్లో సందేశం చెప్పించడమే గాకుండా, వాటిని ఆచరించి చూపే విధంగా "మల్లన్న"ను నిర్మాత ధాను అద్భుతంగా తెరకెక్కించనున్నారని దర్శకుడు అన్నారు.
ఈ సినిమా తమిళనాడులో ప్రారంభించిన రోజునే వెనుకబడిన రెండు గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించామని దర్శకుడు తెలియజేశారు. అలా నేటికి 39 గ్రామాలయ్యాయని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నామని సుశీగణేషన్ అన్నారు. తమిళనాడులో "కందస్వామి" ఫౌండేషన్ మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌లో "మల్లన్న" ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు.
ట్రైలర్స్ విడుదల సందర్భంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ.. చక్కని సందేశంతో కూడిన చిత్రమిదన్నారు. "అపరిచితుడు" ద్వారా సమాజం తప్పని చేతులు దులుపుకోకుండా, మనం కూడా ఏదో చేయాలనే సందేశం చెప్పించామన్నారు. అదేవిధంగా "మల్లన్న"కూడా మరో సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకుందని విక్రమ్ చెప్పారు.
ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, వివిధ గెటప్స్ వేయడంతో ఏడాదిన్నర పట్టిందని విక్రమ్ అన్నారు. సి.జి.వర్క్ కార్యక్రమాలకు, నిర్మాత సేవా కార్యక్రమాలు తోడయ్యాయని ఆయన వెల్లడించారు. ఇంకా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో తాను పాటలు పాడనని విక్రమ్ తెలిపారు.
నిర్మాత ధాను మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడియోను ఈ నెల 19వ తేదీన, సినిమాను వచ్చేనెలాఖరులో విడుదల చేస్తామని చెప్పారు. ఏదో సినిమా తీశామని గాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడమనే అంశాన్ని తెలుగు సినిమాలో మొదటిసారిగా నిర్మాత తీసుకురావడం అభినందనీయమని సి. కళ్యాణ్ పేర్కొన్నారు.