Raju Maharaju audio launch | ''రాజు మహారాజు'' ఆడియో ఆవిష్కరణ
|
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి జయసుధ ఆడియోను ఆవిష్కరించగా, సీడీని దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు.
ఆడియో విడుదల సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. భానుశంకర్, తాను ఇంటర్‌మీడియట్‌లో క్లాస్‌మేట్స్ అని చెప్పారు. సహజంగా ట్రైలర్స్ చూస్తే సినిమా కథ అర్థమైపోతుందని, కానీ రాజు మహారాజు ట్రైలర్ వెరైటీగా ఉందన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశించారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ.. శర్వానంద్ నటించిన "అమ్మచెప్పింది" తన ఫేవరేట్ చిత్రమన్నారు. అతను చేసిన ఈ సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. భానుశంకర్ దర్శకత్వంలో మూడు సినిమాల్లో నటించానని నటి జయసుధ అన్నారు.
సెంటిమెంట్‌గా ఈ సినిమాలో చిన్న పాత్ర చేయమంటే చేశానని ఆమె తెలిపారు. శర్వానంద్ అమ్మచెప్పింది సినిమాలో తాను నటించాల్సిందని కానీ, అది కుదరలేదని జయసుధ వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. తన అసలు పేరు దుర్గాశంకర్ అని, కొత్త జీవితం కోసం పేరు మార్చుకున్నానని చెప్పారు. ఎన్నో కష్టాలతో ఈ సినిమా తీశామని, విజయవంతమైతే క్రెడిట్ నిర్మాతదని తెలిపారు.
జయసుధ, రమ్యకృష్ణ, మోహన్ బాబు కాంబినేషన్‌లో దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని భానుశంకర్ పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. కథ చెప్పిన వెంటనే నచ్చి అంగీకరించానని, సీనియర్ నటుల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ సినిమాకు మోహన్ బాబు, శర్వానంద్, సంగీత దర్శకుడు చక్రిలతో కలిసి ముగ్గురు హీరోలని నిర్మాత అన్నారు. ఇంకా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.