నాని, మాధవీలత జంటగా జెమినీ ఫిలిమ్ సర్క్యూట్ సమర్పిస్తున్న చిత్రం 'స్నేహితుడా'. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. నిర్మాత రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా శుక్రవారం రాత్రి విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌ప్రసాద్ ఆడియోను ఆవిష్కరించగా, సీడీని హీరో గోపీచంద్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శివరాం శంకర్ మాట్లాడుతూ, ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా చిత్రాలకు బాణీలు సమకూర్చాను. చాలా కాలంగ్యాప్ తర్వాత మళ్ళీ తనకు 'స్నేహితుడా' చిత్రం ద్వారా అవకాశం లభించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఆశిస్తున్నట్లు తెలిపారు. కమ్మని సంగీతం ఇచ్చాను. ప్రసుత్తం రీరికార్డింగ్ జరుగుతోందని శివరాం చెప్పారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ, పాటలు బాగున్నాయి. దర్శకుడు సత్యం దగ్గర అసిస్టెంట్‌గా నాలుగు చిత్రాలకు పనిచేశాను. ఈ చిత్రం అందరికీ గుర్తింపు సంపాదించి పెట్టాలని ఆశించారు.
పోకూరి బాబూరావు మాట్లాడుతూ, సత్యం తన వద్ద నాలుగు చిత్రాలకు పనిచేశాడు. ముక్కుసూటి మనిషి. ప్లానింగ్ ప్రకారం అన్ని పనులు చేస్తాడు. జెమినీ టీవీ సత్యంకు దర్శకుడిగా అవకాశమిచ్చినందుకు స్నేహితుడిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పోకూరి అన్నారు.
శ్యాం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో హీరో, దర్శకుడు అనే కాంబినేషన్‌తో చిత్రాలు వచ్చేవి. గత రెండేళ్ళ నుంచి ట్రెండ్ మారింది. కొత్త తరం వస్తోంది. వారిలో ఎనర్జీ ఎక్కువగా ఉంది. అంత ఎనర్జీతో తెరకెక్కబోతోన్న 'నా స్నేహితుడా' విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు సత్యం మాట్లాడుతూ, సున్నితమైన ప్రేమ కథతో కూడిన లవ్లీ ఎంటర్‌టైనర్ ఇదని తెలిపారు. శివ చక్కని బాణీలు ఇచ్చారని, మాటలు, పాటలు భాష శ్రీ రాశారని దర్శకుడు తెలియజేశారు.