హ్యాపీడేస్, వినాయకుడు ఫేమ్ కృష్ణుడు కథానాయకుడిగా "అమాయకుడు" అనే సినిమా ప్రారంభమైంది. ఆక్టాగాన్ మూవీస్ పతాకంపై భారతిగణేష్ దర్శకుడిగా ఎం.బాలమురగన్ అనిల్ ఎస్.నాయర్, సుదర్శన్ శర్మలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. తొలిషాట్‌కు సినీ నటుడు శ్రీహరి క్లాప్ కొట్టగా, నిర్మాత అనిల్ ఎస్.నాయర్ స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ 'వినాయకుడు' సినిమా తరువాత దాదాపు యాభై స్క్రిప్ట్‌లు విన్నానన్నారు. అయితే ఈ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అంగీకరించానని తెలిపారు. తన ఫేస్‌కు కచ్చితంగా సరిపడే టైటిల్ ఇది. చక్కటి ఫ్యామిలీ కథాంశంతో రూపొందుతోందని చెప్పారు.
కథానాయిక అనన్య మాట్లాడుతూ.. ఇది తన తొలి తెలుగు సినిమా అని తెలిపారు. తమిళంలో చేస్తున్న తనకు ఈ సినిమా ద్వారా తెలుగులో అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన బాలమురుగన్ మాట్లాడుతూ.. దర్శకుడు మంచి కథ చెప్పాడు. హ్యూమరస్‌గా సాగే ప్రేమ కథ. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు.
దర్శకుడు భారతి మురుగన్ మాట్లాడుతూ.. వినాయకుడు సినిమా చూసిన తరువాత తన ఆలోచనల్లో నుంచి ఈ కథ పుట్టింది. ఒక కొత్త పాయింట్‌తో సెంటిమెంట్ కామెడీలు కలగలపి ఈ సినిమాను తీస్తున్నాను. వినోదంగా సాగే ఈ సినిమాకు ఘటికాచలం మంచి సంభాషణలు రాశారు.
కథానాయకుడు పాత్ర గురించి ఘటికాచలం తెలుపుతూ..'ఇందులో హీరో చాలా అమాయకంగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కుమారుడు తమ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి అమాయకుడు "దేనికి పనికి రాడు" అనుకున్న వాళ్లందరి అంచనాలు తలక్రిందులు చేసి అసాధ్యుడుగా ఎలా తయారయ్యాడు అనేది చిత్ర ప్రధాన ఇతివృత్తమని చెప్పారు.