Billa| 100 Days| Prabhas| Anushka| Namitha| Krishnam Raju | ఆహ్లాదంగా జరిగిన ''బిల్లా'' శతదినోత్సవ వేడుక
|
నరేంద్ర, ప్రభోద్‌లు నిర్మాతలుగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిల్లా' ఇటీవలే ద్విగ్విజయంగా 13 కేంద్రాల్లో శతదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. కాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుక జూలై 14న హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీ ఫంక్షన్‌లా జరిగింది.
ఈ కార్యక్రమంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, డా.మోహన్‌బాబు, సుమన్, జగపతిబాబు, రవితేజ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, కోడిరామకృష్ణ, జయంత్‌సి.పరాన్జీ, ఎస్.ఎస్.రాజమౌళి, 'దిల్'రాజు, పరిచూరి వెంకటేశ్వరరావు, అలీ, ప్రభాస్, అనుష్క, హాన్సిక, చిత్ర దర్శకులు మెహర్‌రమేష్, నిర్మాతలు ప్రభోద్, నరేంద్ర, శ్రీమతి శ్యామలాకృష్ణంరాజు, సుబ్బరాజు, సుప్రీత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బిల్లా శతదినోత్సవ సందర్భంగా చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లకు మోహన్‌బాబు, కృష్ణంరాజు, ప్రభాస్, అనుష్క, మెహర్‌రమేష్ చేతుల మీదుగా 100 రోజుల షీల్డ్‌ల బహుకరించారు. రాష్ట్ర కృష్ణంరాజు అసోసియేషన్ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీరామచంద్రశాస్త్రి ప్రత్యేకంగా తయారు చేసిన 100 డేస్ షీల్డులను కృష్ణంరాజు, ప్రభాస్‌లకు అందజేశారు. ఈ శతదినోత్సవ వేడుకలు రోటిన్‌కు భిన్నంగా, ఉపన్యాసాలు లేకుండా వినూత్నంగా ఓ కుటుంబ వేడుకలా జరిగింది.
ఈ సందర్భంగా డా.మోహన్‌బాబు మాట్లాడుతూ... 'గోపి కృష్ణ బ్యానర్ తనకు కొత్త కాదన్నారు. గతంలో ఈ సంస్థ నిర్మించిన 'తాండ్ర పాపారాయుడు' చిత్రంలో నటించాను. ఒక రోజు మద్రాస్‌లో షూటింగ్ జరుగుతుండగా అదే రోజు తాను వేరే ఊరు మ్యారేజ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ విషయాన్ని వారికి చెబితే తనను బెంజ్ కారులో పంపించారు. తన జీవితంలో బెంజ్‌కారు ఎక్కింది అదే మొదటిసారి. అలా ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమ సొంత మనుషుల్లా ఈ గోపికృష్ణ సంస్థ వారు భావిస్తారు. కృష్ణంరాజు తనకంటే సీనియర్ నటుడు. నటులుగా కంటే తాము ఆత్మీయులం, కుటుంబ సన్నిహితులమని" మోహన్ అన్నారు.
ఇక కృష్ణంరాజు నట వారసుడు యంగ్ డైనమిక్ హీరో ప్రభాస్ 'బుజ్జిగాడు'లో ఏ ముహుర్తాన తనను బావ అని పిలిచాడో..? ఆ పదానికి అసలైన నిర్వచనంలా ప్రభాస్ వ్యవహరించాడు. ప్రభాస్ మంచి నటుడే గాకుండా సంస్కార వంతుడని మోహన్‌బాబు కితాబిచ్చారు. ప్రభాస్ నటించే ప్రతి చిత్రం విజయవంతమవ్వాలని, 100 సంవత్సరాలు గుడ్ హెల్త్ అండ్ వెల్త్‌తో ప్రభాస్ ఉండాలని మోహన్‌బాబు ఆకాంక్షించారు. అలాగే అనుష్క, డైరెక్టర్ మెహర్‌రమేష్‌లతో పాటు సినిమా యూనిట్ మొత్తం గుడ్ జాబ్ కనబర్చారని ఆయన అన్నారు.
సుమన్ మాట్లాడుతూ... 'ఈ చిత్రాన్ని మొదట తాను థియేటర్‌లో చూడలేదు. ఇటీవలే డీవీడీలో చూశాను. ఇంతకు ముందువచ్చిన తమిళ, హిందీ 'బిల్లా' పిక్చర్స్ చూశాను. తెలుగు చిత్రాల టేకింగ్‌లో, మేకింగ్‌లో ఇలాంటి సినిమా ఇంత వరకు రాలేదు. దర్శకుడు మెహర్‌రమేష్.. ప్రభాస్ ఇరు పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హిట్టయిన "బిల్లా" లాంటి సినిమాలో గోపికృష్ణ పతాకంపై ఇంకా అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించాలని సుమన్ కోరారు.
రాజమౌళి మాట్లాడుతూ... 'ఈ సినిమా కథని ఇప్పటికే ఐదుసార్లు చూశాం. ప్రతిబిట్ తెలిసినా ఈ ప్రాజెక్టుని స్వీకరించి సక్సెస్ చేయడం మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు మెహర్‌రమేష్‌దే' అన్నారు.
అలీ మాట్లాడుతూ... 'ఫస్ట్‌టైమ్ ఈ సంస్థలో వర్క్ చేసే అవకాశం 'బిల్లా' ద్వారా లభించింది. మలేషియాలో 75 రోజులు షూటింగ్ చేశాం. ఏ రోజు కూడా ఒక్క ఇబ్బంది కల్గకుండా నిర్మాతలు ప్లాన్ చేసి తీశారు. ఈ చిత్రం మంచి హిట్ అయ్యి వంద రోజుల షీల్డ్ అందుకోవడం ఆనందంగా ఉందన్నా'రు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ... 'తమ గోపికృష్ణ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్ని మంచి హిట్ అయ్యాయి. మరలా దాదాపు 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత 'బిల్లా' నిర్మిస్తే ప్రజలు ఇంతగొప్పగా ఆదరించటం చాలా ఆనందం కలిగిస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో 'బిల్లా'ను తీశారని అందరూ ప్రశంసలు కురిపించారు.
కష్టపడి బిల్లా సినిమా తీశాం. ఎవ్రీఫ్రేమ్ విజువల్‌గా సౌందర్‌రాజన్ ఫొటోగ్రఫి వలన అద్భుతంగా వచ్చింది. మణిశర్మ చక్కని మ్యూజిక్.... ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ తమ సొంత పిక్చర్‌లా భావించి చాలా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలతో పాటు అభినందనలు కూడా తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామ'న్నారు.