Edida Nageswara Rao| Chiranjeevi| Sankarabharanam| S.P.B | ఏడిద జీవితం స్ఫూర్తి : చిరంజీవి
|
ఈ సందర్భంగా సంస్థ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానం జరిగింది. పూర్ణోదయ సంస్థతో ముడిపడిన కళాకారులు, వేదికపై నిండుగా కన్పించే ఆత్మీయమైన హృదయ స్పందనలతో కిక్కిరిసిన తీరు ప్రేక్షకులకు అమితానందాన్ని పంచారు.
ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి ఎంతో ఉద్విగత, ఆర్థ్రత కూడిన స్వరంతో మాట్లాడారు. డబ్బే ప్రధానంగా భావించి జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్న ఎందరికో ఏడిద జీవితం గురించి తెలుసుకోవాల్సింది వుందన్నారు. "శంకరాభరణం" వంటి ఉత్తమ విలువగల చిత్రాల నిర్మాతగా ఏడిద గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
పూర్ణోదయ సంస్థకు దర్శకుడు విశ్వనాథ్ ఏడిద వంటి నిర్మాతను ఎంపిక చేసుకుని స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాలతో తనకు అవకాశమిచ్చి, జాతీయస్థాయి అవార్డులను అందుకొనే స్థాయికి తనను చేర్చారని కృతజ్ఞతలు తెలిపారు. తొలినాటి సంఘటన స్ఫురణకు తెచ్చుకొంటూ, ఏడిద టేబుల్ ఫ్యానును ఇస్తానని వాగ్ధానం చేసి ఇప్పటివరకూ ఆ బహుమతి ఇవ్వలేదని, కానీ బహుమతిగా రెండు నంది అవార్డులు అందుకొనే చిత్రాలు ఇచ్చారని, భార్య సురేఖను పొందటంలో సిఫారసు చేశారని వివరించారు. విశ్వనాథ్ తనకు నటనను నేర్పారు. ఆయనే తనను శిల్పంగా మార్చారని కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ దర్శకుడు డాక్టర్ కె. విశ్వనాథ్ మాట్లాడుతూ చిరంజీవి ఆపద్బాంధవుడు చిత్రంలోని నటన నేటితరం వారికి ఒక పాఠ్యగ్రంథమన్నారు. అందవిహీన పాత్రలో నటించి శోభన్‌బాబు చెల్లెలి కాపురం హిట్‌చేశారని, చిరంజీవి స్వయంకృషిని హిట్‌చేశారని, తనను దర్శకునిగా పెట్టుకొని ఆ చిత్రాలను నిర్మించిన ఏడిద ధైర్యాన్ని మెచ్చుకోవాలని అభినందించారు.
ప్రముఖ గాయకులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సినిమా వ్యాపారమే కానీ, ధైర్యం, సంస్కారం మిళితం చేసి విలువలున్న చిత్రాలను నిర్మించి డబ్బు సంపాదించవచ్చని నిరూపించిన వారు ఏడిద అన్నారు. సంప్రదాయ సంగీతం తెలిసినవాడిగా తనకొక గుర్తింపునిచ్చిన చిత్రం శంకరాభరణమని చెప్పారు. ఈ సందర్భంగా బాలు ఏడిదకు, విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ ఎన్ని చిత్రాలలో ఎన్నిభాషలలో తీసినా, పూర్ణోదయ సంస్థలో తాను నటించిన సితార చిత్రం మరల తీయలేనంత గొప్పదని చెప్పారు. మరొక నటుడు శరత్‌బాబు మాట్లాడుతూ.. గొప్పదర్శకుడు, గొప్ప నిర్మాత కలయికలో వచ్చిన చిత్రాలు ఎంత ఉత్తమంగా వుండగలవో పూర్ణోదయ సంస్థ నిరూపించిందన్నారు.
హాస్యనటులు అలీ మాట్లాడుతూ తనకు సినీజీవితాన్ని ప్రసాదించిన మహోన్నతులు ఏడిద, విశ్వనాథ్‌లని కొనియాడారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఉత్తమాభిరుచి సందేశం మిళితంగా చిత్రాలకు నిర్మించిన ఏడిద, ఇతరులు సాహసించని ఇతివృత్తాలను కథాంశాలుగా ఎంపిక చేసుకున్నారని అభినందించారు.
అనంతరం ఏడిదకు సినారె, జమునారాణి, గాయకులు యస్పీ, శైలజ, నటులు రాళ్ళపల్లి, గుండు హనుమంతరావు, తదితరులు శాలువా మాలలతో సత్కరించగా చిరంజీవి విజ్ఞాపికను బహూకరించారు.